AP Liquor Scam Case: ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తోంది సిట్. ఈ కేసులో నలుగురు నిందితులు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను ఒకే సారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్లు వేసింది సిట్. ఈ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఈ నెల 29న తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది. లిక్కర్ స్కాం కేసులో ఏ1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఏ31గా ధనుంజయ రెడ్డి, ఏ32గా కృష్ణమోహన్ రెడ్డి, ఏ34గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. వీరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని నిజాలు వెలుగుచూస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిని ఏడు రోజులు పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది దర్యాప్తు బృందం. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలతో కలిపి రాజ్‌ను విచారించాలని అప్పుడే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఈ క్రమంలోనే రాజ్ కేసిరెడ్డిని మూడు రోజులు, మిగతా ముగ్గురు నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేసి వాదనలు వినిపించింది. నలుగురు నిందితులను కలిపి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురు నిందితులను కలిపి విచారిస్తే కీలక విషయాలు బయట పడే అవకాశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సీజ్ చేసిన ఫోన్లు, ఇతర మెటీరియల్‌ను కోర్టులో సబ్‌మిట్ చేయకుండా నేరుగా FSLకు పంపుతున్నట్లు పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ ఆఫీసులో ఆడియో, వీడియో రికార్డు ఉందని కస్టడీకి ఇస్తే అక్కడకు పంపి ఆడియో, వీడియో రికార్డు చేయించాలని కోర్టును కోరారు. విచారణలో అడిగిన ప్రశ్నలు, విచారణ వివరాలు కోర్టుకు అందించాలని పిటిషనర్ న్యాయవాదులు కోరారు. దీంతో సీల్డ్ కవర్‌లో వివరాలు ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది ఏసీబీ కోర్టు.