రేపటి నుంచి మహానాడు… పసుపు పండుగకు కడప ముస్తాబు..
తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు .. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు.. పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు. చంద్రబాబు ప్రసంగించిన తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు… ఏపీలో ఏడాది పాలనపై మహానాడు వేదికగా 14 ముసాయిదా తీర్మానాలకు రూపకల్పన చేయనున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన ఘన విజయాలు… సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం.. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు తీర్మానాలు ప్రవేశపెడ్తారు. మహిళ, యువత సంక్షేమానికి పెద్ద పీట … సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం… మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా తీర్మానాలు ప్రవేశపెడ్తారు. కేంద్ర ప్రభుత్వ తోడ్పాటు.. ఒకే రాజధాని అమరావతి అభివృద్ధి కేంద్రీకరణ ఈ అంశాలు అన్నిటి మీద కూడా ప్రధానంగా తీర్మానాలు చేయనున్నారు. మహానాడులో ప్రధానంగా కూటమి ఏడాది పాలనకు సంబంధించి చర్చ జరుగనుంది. సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని అమరావతిపై మొదటి రోజు చర్చిస్తారు. శాంతి భద్రతలు, మహిళ యువత సంక్షేమం కోసం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి చర్చిస్తారు. ఇక, రెండో రోజు మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తారు. తర్వాత తెలంగాణకు సంబంధించి తీర్మానాలు ఉంటాయి. ఆ రోజు పి 4 పై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడ్తారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. లోకేష్‌కు కీలక పదవికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
మరోసారి మారిన కడప జిల్లా పేరు.. ఉత్తర్వులు జారీ..
మరోసారి మారిన కడప పేరుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. గతంలో ఉన్న కడప పేరును గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ జిల్లాగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అయితే, దీనిపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన కడప పేరు మార్పుపై ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలుపుతూ వచ్చాయి… ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడప పేరు మార్పు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది… వైఎస్సార్ పేరుతో పాటు కడప అన్న పదాన్ని కూడా చేర్చాలని ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి.. ఈ మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కడప పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నెలలోపు తెలపాలని కడప కలెక్టర్ శ్రీధర్ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఈనెల 25 ఆఖరి తేదీ గడువు ముగియడంతో పాటు, ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వానికి కడప పేరు మారుస్తూ నివేదికలు పంపారు జిల్లా అధికారులు… ఈ మేరకు ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ వైఎస్సార్ కడప జిల్లాగా ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం..
వల్లభనేని వంశీని మళ్లీ కస్టడీకి ఇవ్వండి.. పోలీసుల మరో పిటిషన్
వైఎస్సార్ కాంగ్రెస పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది నూజివీడు కోర్టు.. మరోవైపు.. వల్లభనేని వంశీనీ రెండోసారి కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీని మూడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు తాజాగా పిటిషన్ వేశారు.. ఇప్పటికే ఇదే కేసులో రెండు రోజుల పాటు వల్లభనేని వంశీని న్యాయస్థానం కస్టడీకి ఇచ్చింది.. అయితే, వంశీ సరిగా విచారణకు సహకరించక పోవటంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు.. అయితే, పోలీసుల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నూజివీడు కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది..
పోలీసులపై దాడి చేస్తే ఇలా ఉంటది మరి.. నిందితులకు నడిరోడ్డుపై కోటింగ్..!
గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన రౌడీషీటర్ అనుచరులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. నెల రోజుల క్రితం ఐతానగర్‌లో కానిస్టేబుల్ చిరంజీవిపై గంజాయి మత్తులో దాడిచేశారు రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు విక్టర్, బాబూలాల్, రాకేష్.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు తెనాలి టూ టౌన్ పోలీసులు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే, పోలీసులు ఇలా నడిరోడ్డుపై నిందితులకు కోటింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. కొందరు పాజిటివ్‌గా.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.. ఇక, బాధిత ఎస్సీ యువకులని నడి రోడ్డుపై చితక్కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది..
షాకింగ్..! ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి.. వాడేది పశువుల కొవ్వు..!
మార్కెట్‌లో దొరికేది ఏది అసలు.. ఏది నకిలీ కనిపెట్టడమే కష్టంగా మారుతోంది.. బ్రాండెడ్ అనుకున్నదానిమాటులో.. ప్రజలు ఏం తింటున్నారో కూడా తెలియని పరిస్థితి.. ఇక, ఆత్రేయపురం పూతరేకులు అంటే.. అంతా లొట్టలేసుకుంటూ లాగించేస్తారు.. అంతర్జాతీయంగా పూతరేకుల తయారీకి గుర్తింపు పొందిన ఈ ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి వినియోగం ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.. ఎంతో ఇష్టంగా తినే పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారట.. పశువుల కొవ్వు వాడేస్తున్నారట.. కల్తీ నెయ్యి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతున్న వేళ.. ఆత్రేయపురం పూతరేకుల్లోనూ కల్తీ నెయ్యి వినియోగం పెరిగిపోయింది.. పశువుల కొవ్వు నుంచి వచ్చిన కల్తీ నెయ్యిని చిరు వ్యాపారులతో అమ్మకాలు సాగిస్తున్నారు.. ప్రజారోగ్యంతో చలగాటం ఆడుతున్నారు..
త్వరగా తెలంగాణ కేబినెట్ కూర్పు చేయాలని రాహుల్ గాంధీని కోరాం..
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ (మే 26) సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా కలిశారు. ఇక, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాహుల్ కి వివరించాను.. అలాగే, వీలైనంత త్వరగా రాష్ట్ర కేబినెట్ కూర్పు చేయాలని మనవి చేశాను.. త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. మంత్రి వర్గ విస్తరణతో పాటు త్వరలోనే పీసీసీ కమిటీల ప్రకటన ఉంటుంది అన్నారు. అయితే, రాష్ట్ర కేబినెట్ విస్తరణ విషయంలో అధిష్టానానికి మేం మా వర్షన్ చెప్పామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతున్నాం.. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలు.. కేసి వేణుగోపాల్ పార్టీ అధిష్టాన పెద్దలతో మాట్లాడుతున్నారు.. ఒకట్రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుంది అని మహేష్ గౌడ్ వెల్లడించారు.
నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై మావోయిస్టుల లేఖ..
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందని అందులో పేర్కొన్నారు. నంబాల గత 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని చెప్పారు. కేశవరావు టీమ్ లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవల పోలీసులకు లొంగిపోయారు.. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఈ దారుణం జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూనిఫైడ్ కమాండో సభ్యుడు ఒకరు సైతం ద్రోహిగా మారాడని ఆ లేఖలో మావోయిస్టులు రాసుకొచ్చారు. ఇక, ఎన్ కౌంటర్ కు ముందురోజు నుంచి 20 వేల మంది బలగాలు తామున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి.. 10 గంటల్లో ఐదుసార్లు కాల్పులకు దిగింది అని మావోయిస్టులు లేఖలో తెలిపారు. 60 గంటల పాటు భద్రతా బలగాలు తమను నిర్బంధించాయి.. అప్పటికే నంబాల కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చాలా ప్రయత్నించగా.. తమను వదిలి వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదని వెల్లడించారు. నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని తమతోనే ఉన్న కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే.. ఏడుగురం సురక్షితంగా బయట పడ్డాం.. మిగిలిన వారందరూ ఎన్ కౌంటర్లో చనిపోయారని ఆ లేఖలో ప్రస్తావించారు.
మోడీ ర్యాలీకి హాజరైన కల్నల్ సోఫియా ఖురేషి ఫ్యామిలీ.. ప్రధాని ట్వీట్
ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లో పర్యటించారు. వడోదరలో భారీ రోడ్‌షో చేపట్టారు. కారులోంచి అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మోడీపై పూల వర్షం కురిపించారు. సోఫియా ఖురేషి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు కల్నల్ సోఫియా ఖురేషి మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె పాపులర్ అయింది. అయితే ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల.. మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్‌పైకి పంపించారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తీవ్ర ఆక్షేపించింది.
ఎప్పుడూ సరదాగా చేసినట్టే చేసింది.. పోట్లాటపై ఫ్రెంచ్ అధ్యక్షుడు క్లారిటీ
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్-భార్య బ్రిగిట్టే మధ్య జరిగిన పోట్లాటకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానంలో మాక్రాన్‌ను భార్య కొట్టిందంటూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ అంశంపై మాక్రాన్ స్పందించారు. సోమవారం వియత్నాం రాజధాని హనోయ్‌లో జరిగే రాష్ట్ర విందుకు హాజరయ్యే ముందు మెట్రోపోల్ హోటల్ దగ్గర మీడియాకు క్లారిటీ ఇచ్చారు. సరదాగా తన భార్య.. ముఖంపై చెయ్యి వేసి నెట్టిందని.. ఇది జోక్‌గా జరిగిన సంఘటనే అని తేల్చి చెప్పారు. ఇది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ గొడవ ఉందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. తామిద్దరం తరచుగా ఇలా చేసుకుంటామని.. కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ శాంతించాలని కోరారు. నాలుగు రోజుల ఆగ్నేయాసియా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు మాక్రాన్ దంపతులు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో విమానం తలుపు తెరుచుకోగానే.. భార్య బ్రిగిట్టే.. మాక్రాన్ ముఖంపై దాడి చేసింది. చెంప దెబ్బలు కొట్టింది. దీంతో మాక్రాన్ షాక్‌కు గురయ్యారు. వెంటనే మాక్రాన్ తేరుకుని హాయ్ చెప్పడం కనిపించింది. ఇక విమానంలోంచి భార్యతో దిగబోతుండగా చెయ్యి పట్టుకునేందుకు మాక్రాన్ ప్రయత్నించారు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. ఎడముఖం పెడముఖంతోనే ఇద్దరూ విమానం దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరి మధ్య ఫ్యామిలీ గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా అదేమీలేదని మాక్రాన్ క్లారిటీ ఇచ్చారు.
25 ఏళ్ల పెద్దదైన టీచర్‌తో ఫ్రెంచ్ అధ్యక్షుడి ప్రేమ పెళ్లి.. భార్య కూతురు మక్రాన్ క్లాస్ మేట్..
వియత్నాం పర్యటనలో ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్‌కి చేదు అనుభవం ఎదురైంది. విమానం నుంచి దిగుతుండగా, అతడి భార్య బ్రిగిట్టే మక్రాన్ చెంపపై కొట్టడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. అంతే కాకుండా, విమానం దిగేటప్పుడు మక్రాన్ చేతిని బ్రిగిట్టే పట్టుకునేందుకు నిరాకరించింది. విమానంలో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య తగాదా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సంఘటన తర్వాత వీరిద్దరి ప్రేమ కథపై పలువురు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మక్రాన్ తన 15 ఏళ్ల వయసులోనే తన కన్నా 25 ఏళ్ల పెద్దదైన బ్రిగిట్టే ట్రోగ్న్యూక్స్‌తో ప్రేమలో పడ్డాడు. డ్రామా టీచర్ అయిన బ్రిగిట్టే డైరెక్షన్‌లో స్కూల్ డ్రామాలో మక్రాన్ ఒక పాత్ర పోషించాడు. బ్రిగిట్టే టీచర్ నుంచి పార్ట్‌నర్‌గా ఆ తర్వాత భార్యగా మారింది. 1993లో 39 ఏళ్ల వయసులో బ్రిగిట్టే, 15 ఏళ్ల మక్రాన్‌ని కలిసింది. బ్రిగిట్టే కుమార్తె మక్రాన్ క్లాస్‌మెట్ కావడం గమనార్హం. అంతకుముందే ఆమెకు బ్యాంకర్ ఆండ్రీ లూయిస్ అజియర్‌తో వివాహమైంది. మక్రాన్ టీనేజ్‌లో ఉన్నప్పుడే బ్రిగిట్టేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మక్రాన్‌తో వివాహం కోసం బ్రిగిట్టే తన భర్త, ముగ్గురు పిల్లలతో విడిపోవాలని నిర్ణయించుకుంది. బ్రిగిట్టే తన భర్త ఆండ్రీ లూయిస్ ఆజియర్‌ను 2006లో విడాకులు తీసుకుంది. 2007లో మక్రాన్‌ని వివాహం చేసుకుంది. పెళ్లి సమయానికి బ్రిగిట్టేకి 54 ఏళ్లు (ప్రస్తుతం 72 ఏళ్లు), మక్రాన్‌కి 29 సంవత్సరాలు(ప్రస్తుతం 47 ఏళ్లు)
అనిరుధ్ కు విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ మెయింటేన్ చేస్తుంటాడు. చాలా మందికి తన రౌడీ బ్రాండ్ బట్టలు లేదంటే ఇతర ఖరీదైన వస్తువులను గిఫ్ట్ లుగా ఇస్తుంటాడు. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు కూడా మంచి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ నటిస్తున్న తాజా మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జులై 4న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. విజయ్ మూవీకి ఫస్ట్ టైమ్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా అనిరుధ్ కు రౌడీ బ్రాండ్ టీ షర్ట్, షటిల్ బ్యాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ స్పెషల్ గా పోస్టు చేసింది. ఆ వీడియోలో ద బాయ్స్ మీట్ అంటూ రాసుకొచ్చారు. ఇద్దరు ఎనర్జిటిక్ కుర్రాళ్లు కలిసిన వేళ అంటూ రాసుకొచ్చారు. ఇక కింగ్ డమ్ విషయానికి వస్తే.. కథ చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. విజయ్ ఇందులో గుండుతో కనిపించడం.. పైగా అతని లుక్ మరింత మెస్మరైజింగ్ గా అనిపిస్తోంది. విజయ్ కు మంచి హిట్ పడి చాలా రోజులు అవుతోంది. తాజాగా అతను ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఆగిపోయిన సినిమా టైటిల్ పై కన్నేసిన బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన నటన, స్టైల్, మరియు డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ సాధించిన ఈ స్టైలిష్ స్టార్, ఇప్పుడు కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో, అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే టైటిల్‌తో ఒక సినిమా ప్రకటించబడింది. అయితే, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మరియు అభిమానులకు నిరాశ కలిగించింది. ఇప్పుడు, అల్లు అర్జున్ ఈ టైటిల్‌పై మరోసారి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అట్లీ, ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు. అతని సినిమాలు హై-ఇంటెన్సిటీ యాక్షన్, ఎమోషనల్ డ్రామా, మరియు గ్రాండ్ విజువల్స్‌కు పెట్టింది పేరు. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ మరియు అట్లీ ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు.