గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80 శాతానికి పైగా చేరింది. ఆర్టీసీ ఎన్టీయార్ జిల్లాకు ఈ వేసవి సీజన్ బాగా కలిసొచ్చింది. మే నెలలో 71 శాతం ఓఆర్ తో రోజుకు 1.16 కోట్ల చొప్పున 35.99 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, ఈ నెల 13వ తేదీన ఒక్కరోజే రూ.1.46 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. ఈ సీజన్‌లోకెల్లా ఇదే అత్యధిక రాబడి కావడం విశేషం.
Read Also: Anantha Babu: డ్రైవర్ హత్య కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, పరీక్షలు పూర్తయిన విద్యార్థులకు సెలవలు రావటం, పుణ్య క్షేత్రాలు, విహార యాత్రల సందర్శనకు వెళ్లేవారి సంఖ్య పెరగటం, పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో వెళ్లేవారు అధికంగా వుండటం ఆర్టీసీ ఆదాయం పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.. ఇన్నాళ్లు ప్రయాణికులు ఆశించిన స్థాయిలో లేక అవస్థలు పడ్డ ఆర్టీసీ బస్సులు కొన్నాళ్లుగా నిండుగా ప్రయాణికులతో కలకలలాడుతున్నాయి. దీంతో జిల్లా ఆర్టీసీకి అధిక ఆదాయం తెచ్చిపెడుతుంది.