ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని బీఆర్‌టీఎస్ రోడ్డు మొత్తం కనుచూపు మేర ఉద్యోగులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో ఏ ఉద్యమంలోనూ ఇంతమంది పాల్గొన్న దాఖలాలు లేవు. పోలీసులు జిల్లాల్లోనే కొందరు ఉద్యోగులను అడ్డుకున్నా.. మారు వేషాల్లో చలో విజయవాడకు ఉద్యోగులు తరలివచ్చారు.
రైతులు, కూలీల వేషంలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు అనేక ఫొటోలు చెబుతున్నాయి. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఉద్యోగులు తరలివచ్చారు. తాజా వీడియోలు చూస్తుంటే అంచనాలకు మించి ఉద్యోగులు విజయవాడ చేరుకున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, కంచెలు నిరుపయోగంగా మారాయి. బీఆర్‌టీఎస్ రోడ్డులో బహిరంగ సభకు అనుమతి లేకపోవడంతో పీఆర్సీ సాధన సమితి నేతలు ట్రాలీ ఆటోపై నిలబడి ప్రసంగించారు. తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి నుంచి పెన్‌డౌన్ చేపడతామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని… 7వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని.. డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని వారు ప్రకటించారు.