Venkaiah Naidu: బాపట్ల జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నాడు పర్యటించారు. వేటపాలెం మండలంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన 100 సంవత్సరాల పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ్ల బాపయ్య విద్యా సంస్థల శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. చీరాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. అన్ని దానాలలో విద్యాదానం చాలా గొప్పదని వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Read Also: Virat Kohli: హైదరాబాద్‌లో 50 అడుగుల విరాట్ కోహ్లీ కటౌట్.. ఫోటో వైరల్
కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయడంలోనే తనకు తృప్తిని ఇస్తుందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. విద్య ఒక నిధి లాంటిది అని.. విద్య ఎన్నటికీ వ్యాపారం కాకూడదని ఆకాంక్షించారు. చదువుతో పాటు విద్యార్థులు లోకజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని సూచించారు. నీతి శతకాలను మనం మర్చిపోయామని.. అందరూ వాటిని మననం చేసుకోవాలన్నారు. తెలుగు భాష కన్ను లాంటిది అని.. ఇంగ్లీష్ భాష కళ్లద్దాలు లాంటిదని.. కన్ను లేనప్పుడు కళ్లద్దాలు పెట్టుకుని ఉపయోగం ఏంటని తనదైన శైలిలో వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. అంతకుముందు వేటపాలెం మండలం కొత్తపేట రావిసుబ్బరాయుడు కళ్యాణమండపంలో ఆత్మీయులతో అల్పాహార విందు కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.