Vellampalli Srinivas: 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పనిబడతాం.. వాళ్లు ఏమీ పీకలేరు అంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. విశాఖ గ్లోబల్ సదస్సు విజయవంతం అయిన నేపథ్యంలో విజయవాడలో సంబరాలు నిర్వహించారు.. కేక్ కట్ చేసి కార్యకర్తలతో విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.. ఈ సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మార్చి 3, 4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ని భారతదేశంలో అనువైన ప్రాంతంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చిదిద్ది గ్లోబల్ సమ్మెట్ ను విజయవంతం చేశారని కొనియాడారు.. గ్లోబల్ సమ్మెట్ ను విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను, సీఎంగా పనిచేశాను అని చెప్పే చంద్రబాబు చేయని విధంగా సమ్మెట్ ను జగన్ మోహన్ రెడ్డి నిర్వహించారని ప్రశంసలు కురిపించారు.
Read Also: Nawazuddin Siddiqui: మాజీ భార్య ఆరోపణలకు బదులిచ్చిన బాలీవుడ్ స్టార్!
జీఐఎస్‌లో 13 లక్షల కోట్ల రుపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం.. ఈ పెట్టుబడులతో రాష్ట్రం రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు వెల్లంపల్లి.. విశాఖపట్నంను అద్భుతంగా అభివృద్ధి చేసి పెట్టుబడులు మరిన్ని ఆకర్షిస్తాం అని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గతంలో సూట్లు వేయించి తీసుకువచ్చి పెట్టుబడులు తీసుకువచ్చాం అని ప్రచారాలు చేసేవారు అని ఆరోపణలు గుప్పించారు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అంబానీ, అదాని వంటి పెద్ద పారిశ్రామికవేత్తల్ని తీసుకువచ్చారని తెలిపారు. అసలు పవన్ కల్యాణ్‌కు.. అంబానీ గానీ ఇతర పారిశ్రామికవేత్తలు ఎవరైనా అపాయింట్‌మెంట్ ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. రౌడీల లెక్కలు తీరుస్తాం అంటున్నారు చంద్రబాబు.. ముందు కుప్పంలో గెలవాలి అని సవాల్ చేశారు. లోకేష్ , చంద్రబాబులు ఏమి పీకలేరంటూ ఘాటుగా స్పందించిన ఆయన.. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టుకొని గెలిచే దమ్ము చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయని చంద్రబాబుకు అసలు ప్రశ్నించే హక్కు ఉందా ? అని నిలదీశారు. 2024లో ప్రతిపక్ష హోదా కోల్పోతారు.. 2024 ఎన్నికల తర్వాత లోకేష్, పవన్ కల్యాణ్, చంద్రబాబు పనిబడతామంటూ హెచ్చరించారు. మా పార్టీ విధానం మూడు రాజధానులు.. రాష్ట్రంలో మూడు రాజధానులు అభివృద్ధి చేస్తాం.. విశాఖ పరిపాలన రాజధానిగా అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.