Andhra Pradesh: కృష్ణా జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎంపీ కేశినేని నానిని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వసంత నాగేశ్వరరావు తాజాగా టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానిని కలవడం చర్చనీయాంశమైంది. ఆయన కేశినేని నాని కలిసి పలు విషయాలపై చర్చించారు. కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లు కేశినేని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Read Also: Distribution of Ration: పండుగొచ్చె.. కానీ రేషన్ ఎస్తలే..
కాగా గతంలో ఎన్టీఆర్ వంటి ఓ మహనీయుడు పేరు మార్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఏంటని జగన్ ప్రభుత్వాన్ని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఎన్టీఆర్ లాంటి మహనీయుడు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందన్నారు. అటు నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు కేశినేని నాని అని వసంత నాగేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. దీంతో ఆయన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మరోసారి తలనొప్పి తెచ్చి పెట్టినట్లయింది. అయితే తండ్రి వ్యాఖ్యలకు కుమారుడు కృష్ణప్రసాద్ ఇటీవల కౌంటర్ ఇచ్చారు. వాగే నోరు, తిరిగే కాలు ఆగదు అన్నట్లుగా తన తండ్రి కూడా అంతేనని.. అవన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పుకొచ్చారు.