మండు వేసవిలో అకాలవర్షాలు అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు నిలువునా మునిగిపోయారు. కామారెడ్డి జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ నీటిలో తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలగనుంది. తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతులు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి మండల సబ్ధల్ పూర్, మల్లయ్య పల్లి కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కుప్పలతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు కూడా వర్షానికి తడిసి పోయాయని, ఇప్పటికైనా కొనుగోలు సెంటర్లలో లేట్ చయకుండా త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరారు. అంతేకాకుండా వడ్ల బస్తాలను రైస్ మిల్లులకు వెంటవెంటనే తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించినట్టు వాతావరణ విభాగం తెలిపింది. పక్షం రోజుల వ్యవధిలోనే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. అకాలవర్షం కారణంగా చేతి కొచ్చిన వరి , మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలతో పట్టణవాసులకు కాస్త ఉపశమనం కలిగితే గ్రామీణ ప్రాంతాల్లో పంటలు అతలాకుతలం అయ్యాయి. ఈదురుగాలులతో వరి నేల రాలింది.మామిడి కాయలు రాలాయి. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది . ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పంట నష్టాన్ని పూర్తిగా అంచనావేసి నష్టపరిహారం అందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు .