కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచినవారి కొంగుబంగారం శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త… నవంబర్ మాసానికి సంబంధించిన శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లు, డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఇవాళ విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది టీటీడీ.. నవంబర్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న తిరుమల తిరుపతి దేవస్థానం.. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.. ఇక, డిసెంబర్ నెల శ్రీవారి సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభించి 24వ తేదీ ఉదయం 10 గంటలకు ముగించనున్నారు టీటీడీ అధికారులు.
Read Also: Rahul Gandhi: నేడు ఏపీలో ముగియనున్న భారత్ జోడో యాత్ర.. మళ్లీ కర్ణాటకలోకి ఎంట్రీ..
మరోవైపు.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.. నిన్న స్వామివారిని 62,725 భక్తులు దర్శించుకోగా.. స్వామివారికి 30,172 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. నిన్న హుండీ ఆదాయం రూ. 5.85 కోట్లుగా ప్రకటించింది టీటీడీ… ప్రస్తుతం సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచిఉన్నారు భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.. ఇక, ఈ నెల 24న దీపావళి, 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనాలు నిలిపివేయనున్న విషయం తెలిసిందే.. ఈ మూడురోజుల్లో బ్రేక్ దర్శనాలను రద్దుచేసింది టీటీడీ. అందువల్ల ఈ నెల 23న, నవంబర్ 7న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది టీటీడీ.