తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలని చూస్తున్న భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. వరుసగా వివిధ దర్శనలు, సేవల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ ఉదయం 9 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ.. జనవరి 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంబంధించిన ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు అధికారులు.. ఇక, ఈ నెల 11వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.. తిరుపతిలో 4 కేంద్రాల వద్ద వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ. ఇక, ఎల్లుండి ఆన్ లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. జనవరి 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరియు ఫిబ్రవరి మాసానికి సంబంధించిన టికెట్లు విడుదల చేస్తారు..
Read Also: Astrology : జనవరి 07, శనివారం దినఫలాలు
మరోవైపు ఈ నెల 10వ తేదీన వసతి గదులు కోటాను విడుదల చేయబోతోంది టీటీడీ.. జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సంబంధించిన గదుల కోటాను విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో పెట్టనున్నారు.. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 45,883 మంది భక్తులు.. వారిలో 17,702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇక, హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). అసలే, శ్రీవారి దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.. దీంతో, భక్తులు ప్లాన్ చేసుకుని మరీ రెడీగా ఉంటే తప్ప.. ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకడం కష్టమే..