ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వాణిజ్య ఆంక్షలు మరింత తీవ్రతరం కావడంతో భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించాడు. అలాగే, రష్యా నుంచి చమురు దిగుమతిని సాకుగా చూపించి భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిస్థితిపై ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ (IEC) 2025లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్లోబల్ ట్రేడ్ ఫెయిర్ గానీ, ఫ్రీ గానీ లేదు.. టారిఫ్‌లు, నాన్-టారిఫ్ అడ్డంకులు ఆర్థిక సాధనాలుగా కాకుండా వ్యూహాత్మక ఆయుధాలుగా మారిపోయాయి అని పేర్కొనింది. అయితే, భారత్ ఎప్పుడూ టారిఫ్‌లను ఆయుధాలుగా ఉపయోగించలేదు.. దేశీయ పరిశ్రమలు, ఉపాధిని కాపాడటమే మా లక్ష్యం అని నిర్మలా సీతారామన్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).. 12 మంది సైనికులు మృతి..!
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ సైన్యంపై మరోసారి భారీ దాడులు నిర్వహించినట్టు ప్రకటించింది. ఈ ఆపరేషన్లలో 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్లు, అలాగే మూడు మంది BLA కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సంస్థ వెల్లడించింది. పంజ్గూర్లో ప్రభుత్వ భవనాలను ఆక్రమించామని, రేకో డిక్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వాహనాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని BLA పేర్కొంది.
తెలంగాణ తల్లి విగ్రహంపై దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన ఆర్అండ్బీ శాఖ
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో జరుగుతున్నది అంతా అసత్య ప్రచారమని, వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ పద్ధతిలో ఆవిష్కరించారు. ఆ వేడుక కోసం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో 12 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
ఆ విషయంలో గ్రేట్! పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు..
కలెక్టర్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా.. పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని కనియాడారు.. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు.. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే.. తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలన్నారు. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నామని తెలిపారు.
అక్రమ సంబంధాలకు ఓకే.. పెళ్లికి నో? హైపర్ ఆది కామెంట్స్ వైరల్
జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో కుల వ్యవస్థ మరియు పరువు హత్యలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తనకు కాలేజీ రోజుల నుంచే కుల భావన మీద విరక్తి ఉందని, మనుషులను కులం పేరుతో విభజించడం వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘అవసరం వచ్చినప్పుడు కులం పనిచేయదు, కేవలం మనిషి మాత్రమే తోడుంటాడు”’అని ఆది స్పష్టం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ కులం ఏంటో అడగని మనం, పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం కులాన్ని వెతకడం ఏంటని ఆయన నిలదీశారు. ముఖ్యంగా, సమాజంలోని ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ.. అక్రమ సంబంధాల విషయంలో అడ్డురాని కులం, కేవలం పెళ్లిళ్ల దగ్గరే ఎందుకు గుర్తొస్తుంది?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
తిరుపతిలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్..
తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్‌సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. స్క్రబ్ టైఫస్‌ను బుష్ టైఫస్ అని కూడా అంటారు. ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ముందుగా ఇది ఎలుకలకు సోకుతుంది. వాటిని కుట్టిన నల్లిపైకి ఆ సూక్ష్మజీవులు చేరతాయి. నల్లి మనల్ని కుట్టినప్పుడు స్క్రబ్ టైఫస్ మనుషులను సోకుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండగలదు. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు మనుషులను కుడుతుంటాయి. కుట్టినచోట మచ్చలతోపాటు దద్దుర్లు ఉంటాయి. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. తమిళనాడులో మారుతున్న వాతావరణ పరిస్థితులు స్క్రబ్ టైఫస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.
ఇండో–అమెరికన్లకు శుభవార్త.. ప్రారంభమైన ఇండియన్ కాన్సులర్ సెంటర్
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో లాస్ ఏంజిల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కాన్సులర్ సెంటర్ డిసెంబర్ 15, 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్ సేవలు, వీసా సంబంధిత ప్రక్రియలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దరఖాస్తులు, జనన–మరణ ధృవీకరణ పత్రాలు, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా పొందే అవకాశం కలుగుతుంది. ఈ కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని 800 S ఫిగ్యురోవా స్ట్రీట్, సూట్ 1210, లాస్ ఏంజిల్స్, CA 90017 చిరునామాలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు పనిచేస్తుంది. దరఖాస్తుదారుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శనివారాల్లో కూడా సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం.. పశువులపై వరుస దాడులు
కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి మైదానంలోకి వచ్చిన ఈ పెద్దపులి కారణంగా సమీప మండలాల్లో అలజడి నెలకొంది. భిక్కనూరు మండలం, పెద్దమల్లారెడ్డి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ అధికారులు ధృవీకరించారు. దీనితో పాటు, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పెద్దపులి తన ఉనికిని చాటుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు లేగదూడలపై దాడి చేసి వాటిని చంపేసింది. పశువుల మందలపై వరుసగా దాడులు జరుగుతుండటంతో, పశువుల కాపరులు తమ పశువుల భద్రతపై భయపడుతున్నారు. ప్రమాదాన్ని అంచనా వేసిన అటవీ అధికారులు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. పెద్దపులిని ట్రాక్ చేసి అడవిలోకి పంపించేందుకు ఆసిఫాబాద్ నుంచి నలుగురు సభ్యులున్న ఒక ప్రత్యేక బృందాన్ని కామారెడ్డికి రప్పించారు. ఈ బృందం ప్రస్తుతం పెద్దపులి ఆచూకీ తెలుసుకుని దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
టీటీడీకి తీరని ద్రోహం జరుగుతోంది.. మాజీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు..
టీటీడీకి తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. మూడు వెల కోట్ల భూమిని ఒబెరాయ్ హోటల్‌కు ఇచ్చి వేంకటేశ్వర స్వామికే నామాలు పెట్టారని చెప్పారు. పరకామణి దొంగతనం కంటే వందరెట్లు పెద్ద దొంగతనం ఇదన్నారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. వంద రూముల హోటల్ కోసం మూడు వేలకోట్ల విలువైన స్వామి వారి భూములు ఇస్తారా..? అని ప్రశ్నించారు. అలిపిరి రోడ్డులో టూరిజం భూమి తీసుకుని దానిని బదులుగా టీటీడీ భూమి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఓబరాయ్ హోటల్ కోసం అత్యంత విలువైన భూమిని బదిలీ చేశారు. హోటల్ కు ఆ స్థలం ఇవ్వడమే కాకుండా లీజు కూడా మాఫీ చేశారు. మూడువేల కోట్లు విలువైన భూమిని చంద్రబాబు దోచిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు…
కలెక్టర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సూచనలు..
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లు అందరికీ అభినందనలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. 5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేశామని వెల్లడించారు. 1.20 లక్షల ఫాం పాండ్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామని తెలిపారు. రూ. 4,330 కోట్ల మేర నిధులను వేతనాలుగా నేరుగా నుంచి చెల్లించామన్నారు. గ్రామ పంచాయితీల్లో రెవెన్యూ ఆర్జనపై కూడా దృష్టి సారించామని చెప్పారు. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్ధ్యాల పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు.. కేంద్ర పథకాల అమలులో వంద శాతం ఫలితాలు సాధించిన అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లను అభినందించారు. “విజన్ ఉన్న నాయకుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నాం.. 18 నెలల్లో దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటే అది ఒక చరిత్ర.. లోకేష్ ఆలోచనలతో యువతకు ఉపాధి కల్పన దిశగా ముందుకెళ్తున్నాం.. ఇంటింటికి సంక్షేమం, సంపద పంపిణీ లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నాం..” అని కలెక్టర్ల సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.