షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలో హత్యారాజకీయం..? అభ్యర్థి అనుమానాస్పద మృతి..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ గ్రామపంచాయతీ ఎన్నికల వేళ అపశృతి చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో ఆవ శేఖర్ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానస్పద రీతిలో మృతి చెందడం సంచలనంగా మారింది. నాల్గవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆవ శేఖర్ మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైల్వే పోలీసులు గ్రామస్థులకు అందించిన సమాచారం ప్రకారం.. రైలు పట్టాలపై పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహం వద్ద ఆధార్ కార్డు కనుగొన్నారు. మృతుడు కంసాన్ పల్లికి చెందిన ఆవ శేఖర్‌గా గుర్తించి గ్రామస్థులకు సమాచారం అందజేశారు.
“దోస్త్ మేర దోస్త్”.. పుతిన్ పర్యటనకు ముందు భారత్‌కు రష్యా బిగ్ గిఫ్ట్..
రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు. ఇంతలో ఆ దేశం భారత్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చింది. రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన స్టేట్ డూమా భారత్‌తో కీలకమైన సైనిక ఒప్పందమైన రెసిప్రొకల్ ఆపరేషన్స్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ (RELOS)ను అధికారికంగా ఆమోదించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు ఈ చర్య తీసుకున్నారు. ఈ అంశంపై డూమా స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ మాట్లాడుతూ.. భారతదేశంతో రష్యా సంబంధాలు వ్యూహాత్మకం, సమగ్రమైనవని అభివర్ణించారు. ఈ ఒప్పందానికి ఆమోదం పొందడం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమైన అడుగు అని అన్నారు. ఇది సైనిక సహకారంలో అన్యోన్యతను పెంచుతుందని, రెండు దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తుందని నొక్కిచెప్పారు.
చిత్తూరు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. ఇప్పటికే 380కి పైగా..
చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇప్పటి వరకు జిల్లాలో 380పైగా కేసులు నమోదయ్యాయి.. స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్‌ఫెక్షన్ సోకకపోయినా, కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం.. స్క్రబ్ టైఫస్ పీడితులకు సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు 6-30% వరకు నమోదు కావొచ్చు. రాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్లు గుర్తించే పరీక్షలు కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనే ఉండడం వల్ల ఈ కేసులు పెద్దగా వెలుగులోకి రావడంలేదు. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి లాంటి ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్‌లలో అనుమానిత పరీక్షలు చేస్తున్నారు. ఇవికాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు 17 జిల్లాల్లోనే ఉన్నాయి. అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రావడంతో.. నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేస్తే ఫలితం ఉంటుంది.
తాగిన మైకంలో యువతి రచ్చ.. వాహనదారులకు చుక్కలు
ఇటీవల కొంత మంది యువత మద్యం మత్తులో ఎలా, ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా తాగి రోడ్లపై రచ్చ చేస్తూ, చూసేవారికి ఇబ్బంది కలిగించే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి మద్యం మత్తులో నానా హంగామా చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్‌నగర్ చౌరస్తాలో ఓ యువతి మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసింది. రోడ్డుమధ్యలో నిలబడి వాహనాలు వెళ్లకుండా అడ్డుకుని, డ్రైవర్లతో మాటల తేడాలు పెట్టుకుంది. యువతిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులను కూడా వెనక్కు నెట్టేసింది. “మీరు ఆంధ్రావాళ్లు కాదు… నేను ఆంధ్రాకు వెళ్లాలి” అంటూ అర్థంలేని వ్యాఖ్యలు చేసింది. చివరకు పోలీసులు ఆమెను ఓ ఆటోలో ఆసుపత్రికి తరలించారు. యువతి పేరు ఇందు అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
“అక్క… ఏ బ్రాండ్ తాగావు?” అంటూ కొందరు సరదా కామెంట్లు పెట్టగా,“ఒకప్పుడు అబ్బాయిలే రోడ్లపై గొడవ చేసేవారు… ఇప్పుడు అమ్మాయిలు కూడా అదే దారిలో నడుస్తున్నారు” అంటూ మరికొందరు స్పందించారు.
నేడు సిద్ధరామయ్యతో కేసీ.వేణుగోపాల్ కీలక భేటీ! పంచాయితీ తెగేనా?
కర్ణాటకలో ‘పవర్ షేరింగ్’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ట్విస్టులు.. మీద ట్విస్టులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ‘బ్రేక్‌ఫాస్ట్’ పాలిటిక్స్ సాగుతున్నాయి. అయితే ఈ అల్పాహారం రాజకీయాల వెనుక చాలా కథనే ఉందని విశ్లేషకులు అంటున్నారు. చాలా రోజులు హస్తిన వేదికగా హైకమాండ్‌తో చర్చలు జరిగాయి. అనంతరం కర్ణాటకకు షిప్ట్ అయింది. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్‌కు అల్పాహారం విందు ఇవ్వగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. అనంతరం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య విభేదాలు లేవని.. డిసెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వ్యూహ రచనపై చర్చించినట్లుగా తెలిపారు. చివరిగా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ వ్యాఖ్యతో సిద్ధరామయ్య మెట్టు దిగినట్లుగా భావిస్తున్నారు.
కోకాపేట భూముల వేలం.. నేడు మూడో విడత ఆక్షన్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట నియోపోలీస్ భూముల విలువ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) దశలవారీగా నిర్వహిస్తున్న భూవేలాలకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నాలుగు ప్లాట్లలోని 19 ఎకరాల భూమిని విక్రయించి ₹2,708 కోట్లు సంపాదించిన HMDA, నేడు మూడో విడత వేలానికి సిద్ధమైంది. ఈరోజు ప్లాట్ నంబర్లు 19, 20లోని 8.04 ఎకరాలకు ఆక్షన్ జరగనుంది. గత విడతల్లో ఎకరాకు ₹151.25 కోట్లు పలికిన రికార్డు ధర ఈసారి కూడా దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ (డిసెంబర్ 8, 9) కు ప్రముఖ నేతలను ఆహ్వానించేందుకు సీఎం, డిప్యూటీ సీఎంలు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగే ఈ సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ వివరాలు, దాని ప్రాముఖ్యతను వారికి వివరించనున్నారు. తెలంగాణను భవిష్యత్తు పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు ప్రధానమంత్రి హాజరుకావాలని సీఎం ఆహ్వానించనున్నారు. ఇది వరుస పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రధాన నేతలతో కూడా భేటీలు కొనసాగిస్తున్నారు. నిన్న రాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి అజెండా, సమ్మిట్ లక్ష్యాలను ఖర్గేకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో కూడా భేటీ కావాలని సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సమ్మిట్‌కు హాజరు కావాలనే అభ్యర్థనను వ్యక్తిగతంగా తెలియజేయనున్నారు. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు, కీలక పార్లమెంటరీ నేతలు కూడా సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించనున్నారు.
ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై కేంద్రం కొరడా.. 87 యాప్‌లు బ్లాక్
ప్రతి మనిషికి ఏదొక సమయంలో డబ్బు అవసరం ఉంటుంది. సమయానికి తెలిసిన వారు సాయం చేయకపోయినా.. బ్యాంక్‌లు రుణాలు ఇవ్వకపోయినా వెంటనే ఆన్‌లైన్ లోన్ యాప్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని యాప్‌లు చట్టానికి లోబడి పని చేస్తుంటే.. మరికొన్ని యాప్‌లు అక్రమాలకు పాల్పడుతున్నాయి. మనుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏది నిజమో.. కాదో తెలియక ప్రజలు మోసపోతున్నారు. కొన్ని ఆన్‌లైన్ యాప్‌లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ యాప్‌లపై కేంద్రం కొరడా ఝుళిపించింది.
పానీపూరి కోసం నోరు తెరిచిన మహిళ.. పట్టుకున్న దవడ కండరాలు
పానీపూరి తినేందుకు వెళ్లిన ఓ మహిళకు విచిత్ర అనుభవం ఎదురైంది. పానీపూరి తినేందుకు నోరు తెరిచిన మహిళ నోరు మూసుకోకుండా అలానే ఉండిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో చోటుచేసుకుంది.పానీపూరి తింటున్న సమయంలో ఒక మహిళ తన నోరు మామూలుగా తెరిచింది.. ఈ క్రమంలో ఆమె దవడ అకస్మాత్తుగా లాక్ అయి, నోరు మూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఔరయ్యాలోని ఒక పానీపూరి షాపుకు వచ్చిన మహిళ పూరి తినే సమయంలో నోటిని సాధారణం కంటే ఎక్కువగా తెరిచింది. ఈ సమయంలో ఆమె దవడ జాయింట్ డిస్లోకేట్ అవడంతో నోరు బిగుసుకుపోయి మూసుకోలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్ర అసౌకర్యంతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.