ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరోసారి ఘనమైన గుర్తింపు లభించిందని రాష్ట్ర మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్‌లో నిర్వహించనున్న భారత్ రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ హస్తకళలతో రూపొందించిన ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌లను అందజేయాలని భారత్ హై కమిషన్ నిర్ణయించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సింగపూర్‌లోని భారత్ హై కమిషనర్, మొత్తం 400 ప్రత్యేక గిఫ్ట్ బాక్స్‌ల తయారీకి ఏపీ ప్రభుత్వ సంస్థ లేపాక్షికి ఆర్డర్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ బాక్స్‌లలో సీతాదేవి లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ ఏనుగు కోస్టర్ వంటి సంప్రదాయ కళారూపాలను పొందుపరిచారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ హస్తకళల ప్రత్యేకతను ప్రపంచానికి చాటేలా రూపొందించబడ్డాయి అని వెల్లడించారు.
ఏడాదిలోపే చైనా తినేస్తోంది.. కెనడాకు ట్రంప్ వార్నింగ్
కెనడా లక్ష్యంగా మరోసారి ట్రంప్ విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో చైనాతో సంబంధాలు పెట్టుకోవాలని భావిస్తోంది. ఈ వ్యవహారం ట్రంప్‌కు భారీ కోపం తెప్పించింది. తమ భద్రతా వ్యవస్థను కాదని.. చైనాతో సంబంధాలు పెట్టుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ‘‘మూల్యం చెల్లించుకుంటారు.’’ అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఏడాదిలోపే బీజింగ్ వారిని తినేస్తోందని వ్యాఖ్యానించారు. దావోస్ వేదికగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని ప్రపంచంలో ‘చీలిక’ జరుగుతోందని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఆహ్వాన పత్రికను వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
అమెరికాకు విమానాలు రద్దు.. ఎయిర్ ఇండియా ప్రకటన..
యూఎస్‌కు విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.. అమెరికాలో సంభవించే.. చారిత్రాత్మకంగా నమోదయ్యే అవకాశం ఉన్న శీతాకాల తుఫాను నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ప్రకటన చేసింది. జనవరి 25 మరియు 26 తేదీల్లో.. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు.. న్యూయార్క్, న్యూజెర్సీలోని విమానాశ్రయాలకు వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
సినీనటీ మాధవీలతపై.. టీ బీజేపీ చీఫ్ కు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు
సినీనటీ, ఏపీ బీజేపీ నేత మాధవిలతపై తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రామ చందర్ రావు మాట్లాడుతూ.. శిరిడి సాయి బాబాపై అనుచిత వాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మనోభావాలు దెబ్బ తీయడం సరికాదు.. బాబాపై వాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. సాయి బాబాపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాధవీ లతకు సూచించారు. ఎవరు ఇలాంటి వాఖ్యలు చేసిన వారికి బీజేపీమద్దతు ఉండదు.. ఏకీభవించదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.
చెడు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకూడదు.. గతంలో కనీసం మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి..!
నగరి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2024కు ముందు రాష్ట్రం పూర్తిగా అతలాకుతలం అయిందన్న ఆయన.. నోటీసులు కూడా ఇవ్వకుండా తనను రాత్రికి రాత్రే అరెస్టు చేశారని, గత ఐదేళ్లుగా కనీసం మాట్లాడాలన్నా, నవ్వాలన్నా వీలుకాని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత భయంకరమైన పాలన ఐదేళ్లపాటు కొనసాగిందని ఆయన విమర్శించారు.
నాంపల్లిలో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు..
హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫర్నిచర్ షోరూమ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తానికి వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఒక నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద ఉన్న సెల్లార్‌లోని హోల్‌సేల్ ఫర్నిచర్ షాపులో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు వేగంగా పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో జనం పరుగులు తీశారు.
నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!
తాను చాలాసార్లు సీఎం అయ్యానని, ఎప్పుడూ ఇంతలా అభివృద్ధి చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నగరి టీడీపీకి కంచుకోట అని, వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణ జలాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు. కోసల నగరాన్ని పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం అని, నగరి యువతకు ఉపాది ఇక్కడే కల్పిస్తాం అని చెప్పారు. సూపర్ సిక్స్ ప్రకటిస్తే అసాధ్యం అన్నారని, సూపర్ సిక్స్‌లను సూపర్ హిట్‌గా అమలు చేసి చూపించామని చెప్పారు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
చైనా సైన్యంలో ఏం జరుగుతోంది.? టాప్ మిలిటరీ అధికారులపై విచారణ ఎందుకు..
చైనా సైన్యంలో ఏం జరుగుతోంది..?, వరసగా టాప్ మిలిటరీ అధికారులపై విచారణ ఎందుకు చేపడుతోందనేది ఆసక్తిగా మారింది. చైనా సైన్యంలో అత్యున్నత స్థాయి సైనికాధికారుల్లో ఒకరైన జాంగ్ యౌషియాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కూడా ఇలాగే చాలా మంది సైనికాధికారుల్ని విచారించిన సందర్భంలో కూడా చైనా ‘‘అవినీతి’’ ఆరోపణల్నే ప్రస్తావించింది. విస్తృత అవినీతి నిర్మూలన చర్యల్లో భాగంగానే షి జిన్‌పింగ్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని అంతా భావిస్తున్నారు.
రాత్రికి రాత్రే బస్సు అపహరణ.. కారణం తెలిస్తే షాకే!
విశాఖ మద్దిలపాలెం బస్సు డిపోలో పార్క్ చేసిన బస్సు రాత్రికి రాత్రే అపహరణకు గురైంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి డీజిల్ నిండుగా కొట్టి ఉంచిన బస్సుతో పరారయ్యాడు. బస్సులోని డీజిల్‌ను అమ్మి.. ఆ డబ్బుతో మద్యం తాగడానికి ప్లాన్ వేశాడు. ఈ నెల 17వ తేదీన ఈ ఘటన చోటుచేసుకోగా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సు ఓనర్ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సును అపహారించిన ఈగల పైడి రాజును ఈ నెల 19న అదుపులోకి తీసుకొని బస్సును రికవరీ చేశారు. జనవరి 17వ తేదీన బస్సు చోరికి గురైనట్లు హైర్ బస్సు ఓనర్‌కు డ్రైవర్ అప్పారావు సమాచారం ఇచ్చాడు. ఎంవీపీ పోలీసులకు ఓనర్ నాయుడు ఫిర్యాదు ఇచ్చాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి బస్సు లంకెలపాలెం వైపు వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. బస్సు అపహరించింది తన దగ్గర పనిచేసే మరో డ్రైవర్ పైడి రాజుగా బస్సు ఓనర్ అనుమానించారు. ఈనెల 19వ తేదీన రామా టాకీస్ వద్ద పైడి రాజును పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో ఓ ట్విస్ట్ వెలుగు చూసింది. డీజిల్ అమ్మగా వచ్చిన డబ్బులతో మద్యం కొనుక్కోవచ్చనే ఉద్దేశంతో బస్సు అపహరించానని పైడి రాజు ఒప్పుకున్నాడు. బస్సు రికవరీ చేసి ఓనర్‌కు అప్పగించారు. పైడి రాజు గతంలో కూడా ఇటువంటి చోరికి పాల్పడినప్పటికీ.. అప్పుడు దొరక్కుండా, ఇప్పుడు పట్టుబడ్డాడు.