రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు.. MBBS విద్యార్థిని మృతి..
హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థి ఐశ్వర్యని రోడ్డు దాటుతుండగా అతి వేగంతో వచ్చిన ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య మృతి చెందగా, ఆమె తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి ఐశ్వర్య మృతదేహాన్ని తరలించారు. ఇక, గాయపడిన ఆమె తండ్రిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ స్టూడెంట్ కుటుంబ సభ్యులు NTVతో మాట్లాడుతూ.. ఉదయం 7 గంటలకు హయత్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో మా కోడలు ఐశ్వర్య మృతి చెందగా, ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు.. ఐశ్వర్య ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతుంది.. మార్నింగ్ కాలేజ్ లో ఐశ్వర్యను డ్రాప్ చేసేందుకు తండ్రి తోడుగా వెళ్లాడు.. ఇక, వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది.. కారు ఐశ్వర్యను ఢీ కొట్టడంతో ఐశ్వర్య 10 మీటర్ల అవతల ఎగిరి పడింది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీని ఎవరూ దూషించలేదు.. కానీ బీజేపీ రాద్ధాంతం చేస్తోంది
కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది. ఇదే అంశంపై పార్లమెంట్ వెలుపల ప్రియాంకాగాంధీ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ చోరీ’ సభలో ప్రధాని మోడీని ఎవరూ దూషించలేదని తెలిపారు. వేదికపై నుంచి నాయకులెవరూ ఏం అనలేదని.. కానీ హాజరైన కార్యకర్తల్లో నుంచి ఒక కార్యకర్త ఆ వ్యాఖ్య చేశారని తమకు తెలిసిందన్నారు. కానీ అది ఎవరు అన్నారో మాత్రం స్పష్టంగా తెలియదని చెప్పారు. అయినా నాయకులు అనని మాటను తీసుకొచ్చి సభలో బీజేపీ రాద్ధాంతం చేయడమేంటి? అని ప్రశ్నించారు. సభ సజావుగా నడవడం ఏ మాత్రం అధికార పార్టీకి ఇష్టం లేదని.. కాలుష్యంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తే… పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు మాత్రం.. అనవసరమైన టాఫిక్ తీసుకొచ్చి రగడ సృష్టించారని ఆరోపించారు. కార్యకర్త ఎవరో.. ఏదో అన్నదాన్ని సభలోకి తీసుకురావడమేంటి? అని ప్రశ్నించారు.
నాటి ప్రధానిని స్ఫూర్తిగా తీసుకుని.. ప్రధానిగా మారిన వ్యక్తి మోడీ..
నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని స్ఫూర్తిగా తీసుకుని నేడు ప్రధానిగా మారిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యక్తిత్వం, ఆలోచనలు, పాలన శైలి నేటి ప్రధాని నరేంద్ర మోడీకి స్ఫూర్తిగా నిలిచాయన్నారు.. నెల్లూరులో నిర్వహించిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ.. వాజ్‌పేయిని అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రజల వేదనను తన కవిత్వం ద్వారా వ్యక్తపరిచిన నేత వాజ్‌పేయి అని, పార్లమెంటులో ఆయన ప్రసంగాలు దేశమంతా ఆసక్తిగా వినేలా ఉండేవని గుర్తు చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. 63 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నా.. నమ్మిన సిద్ధాంతాలను వదలకుండా బీజేపీలోనే కొనసాగారని తెలిపారు. కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచిన సందర్భంలో కూడా మనోస్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగారని అన్నారు సత్యకుమార్.
విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయండి.. కేంద్రానికి లోకేష్ విజ్ఞప్తి..
జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయండి అంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్) ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జయంత్ చౌదరిని విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడలోని 5 ఎకరాల స్థలాన్ని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (NSTI) స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా గుర్తించిన విషయాన్ని జయంత్ చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంస్థ ఏర్పాటు ద్వారా అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మంచి SBTET-AP ద్వారా NCVET అర్హతలను పెద్ద ఎత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెంట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎంపీలు పాల్గొన్నారు.
నిఘా సంస్థలను మోసం చేసిన సిడ్నీ కసాయి..
ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్‌లో కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థానీ జాతీయులని అధికారులు తెలిపారు. లాహోర్‌కు చెందిన తండ్రీకొడుకులు హనుక్కా వేడుకలు జరుపుకునేందుకు బోండి బీచ్‌లో గుమిగూడిన జనంపై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో సుమారుగా 15 మంది మృతి చెందారని అధికారుల దర్యాప్తులో తేలింది. సమాచారం అందించిన వెంటనే పోలీసులు రంగంలోకి దాడి చేసిన ఒక వ్యక్తిని ఎదురు కాల్పులలో చంపారు. ఈ సందర్భంగా న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యోన్ మాట్లాడుతూ.. మృతుడిని సాజిద్ అక్రమ్ (50) గా గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఎదురుకాల్పుల్లో సాజిద్ కుమారుడు నవీద్ అక్రమ్ (24) గాయపడ్డాడని చెప్పారు.
ఎవరు బెదిరించిన భయపడకండి.. గ్రామాలను అభివృద్ధి చేయండి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచులకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో, గ్రామానికి సర్పంచ్ కూడా అలానే ఉంటారని కేటీఆర్ అన్నారు. సర్పంచులు ఎవరి కింద పనిచేసేవారు కాదని, వారు సర్వస్వతంత్రులని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని, వారి చేతిలో ఏమీ ఉండదని ధైర్యం చెప్పారు. ముందుగా సర్పంచులు తమ గ్రామపంచాయతీ హక్కులు, అధికారాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. ప్రత్యర్థి కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య విజయం సాధించిన వెంటనే, ఆయన సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించాడు. తమపైనే పోటీ చేశారనే కక్షతో చిరంజీవి ప్రత్యర్థి అభ్యర్థి రాజు కుటుంబంపై ఏకంగా ట్రాక్టర్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనలో బాలమణి, భారతి, సత్తవ్వ, శారదలకు తీవ్ర గాయాలయ్యాయి, వారి పరిస్థితి విషమంగా ఉండటంతో తక్షణమే హైదరాబాద్‌కు తరలించారు.
ఇకపై ఢిల్లీలో ‘తందూరీ రోటీ’ బంద్.. ఎందుకో తెలుసా!
దేశ రాజధానిలో తందూరీ రోటీ బంద్ చేస్తూ DPCC కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత దృష్ట్యా, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి రాజధానిలోని అన్ని హోటళ్ళు, రెస్టారెంట్లు, వీధుల్లోని ఆహార దుకాణాలలో బొగ్గు, కలపతో కాల్చిన తందూరీ రోటీలను పూర్తిగా నిషేధించింది. 1981 వాయు చట్టంలోని సెక్షన్ 31( A) కింద ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు డీపీసీసీ తెలిపింది. ఇకపై కచ్చితంగా అన్ని వాణిజ్య కిచెన్‌లను గ్యాస్, విద్యుత్ లేదా ఇతర ఇంధనాలకు మార్చాలని తెలియజేసింది. DPCC కథనం ప్రకారం .. బొగ్గు, కలపతో వంట చేయడం ద్వారా ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో మరింత కాలుష్యానికి కారణం అవుతుందని తెలిపింది. ఇది గాలి నాణ్యత సూచికలో నిరంతర క్షీణతకు దారితీస్తున్న కారణంగా ఈ ఉత్తర్వును కఠినంగా అమలు చేయాలని, నగరం అంతటా తనిఖీలు నిర్వహించాలని పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. ఈ ఉత్తర్వు వెంటనే అమలులోకి వస్తుందని, దీని అర్థం ఇకపై ఢిల్లీలో తందూరీ రోటీలు అందుబాటులో ఉండవని చెప్పింది.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుంది
ఢిల్లీలో నిర్వహించిన బీసీ మహా ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ రిజర్వేషన్ల పోరాటంలో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను శంకించాల్సిన అవసరం లేదని, బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లోనే బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకున్నామని, కోర్టు గడువు కారణంగానే పంచాయితీ ఎన్నికలకు వెళ్లినా, కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. తాను ఈ ధర్నాకు వ్యక్తిగతంగా కాకుండా పీసీసీ అధ్యక్షుడి హోదాలో వచ్చానని, బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారని, అయితే కేంద్రం ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చకుండా తొక్కి పెడుతోందని ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటానికి సిద్ధంగా ఉందని, బీజేపీ ఎన్ని రోజులు ఆపాలనుకున్నా అది సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తం చేశారు.