భూముల వేలంలో రికార్డు.. రాయదుర్గంలో గజం ధర రూ.3.40 లక్షలు
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000 ల ధర నమోదైంది. ఈ కొత్త ధర పాత రికార్డు కంటే నాలుగు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
ఢిల్లీ కార్ బ్లాస్ట్.. భారత్‌కు ఇజ్రాయిల్ సంఘీభావం..
ఢిల్లీ ఎర్రకొట వద్ద కారు బ్లాస్ట్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం, కారులో అమోనియం నైట్రేట్ నింపుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మరణించారు. కేసు విచారణను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ)కు అప్పగించారు. బాంబ్ దాడిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని, కుట్ర పన్నిన వారిని విడిచిపెట్టమని ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ పర్యటనలో ఉన్న సమయంలో వార్నింగ్ ఇచ్చారు.
సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..
హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. వారికి మళ్లీ రావాలని గతంలోనే సూచించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎలా అప్రోచ్ అయ్యారు.. డబ్బులు ఎలా తీసుకున్నారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
మందకొడిగా జూబ్లీహిల్స్ పోలింగ్
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, ఓటర్లు మొదటి రెండు గంటలు.. అంటే ఉదయం 9 గంటల వరకు.. మాత్రమే కొంత ఉత్సాహంగా వచ్చి 10% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ శాతం క్రమంగా నెమ్మదించింది. సాయంత్రం 3 గంటల సమయానికి కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మందకొడిగా ఉండటానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది ఉప ఎన్నిక కావడంతో ఓటర్లలో నిరాసక్తి ఎక్కువగా ఉంది. అలాగే, ఈ నియోజకవర్గంలో నివసించే సినీ తారలు, ప్రముఖులు గత సాధారణ ఎన్నికల మాదిరిగా పెద్దగా ఓటు వేయడానికి ముందుకు రాలేదు. చాలా మంది ప్రముఖులు నగరంలో అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మరోవైపు, ఇక్కడి ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఉద్యోగులకు సెలవు ప్రకటించకపోవడం వల్ల, వారు ఓటింగ్‌కు దూరమయ్యారు.
పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి.. మాజీ ఎమ్మెల్యే వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు.. గీత అక్కయ్య అమావాస్య పౌర్ణమికి కనిపిస్తూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వంగా గీతపై మండిపడ్డారు.. దమ్ముంటే ఉప్పాడ సెంటర్ కి వచ్చి చర్చించాలి అంటూ సవాల్ చేవారు.. ఎంపీగా పిఠాపురానికి గుండు సున్నా ఇచ్చారు అంటూ వంగా గీతపై విరుచుకుపడ్డారు.. నారా చంద్రబాబు నాయుడు ఆనవాళ్లు కనిపించకూడదని ఏలేరు ఆధునీకరణ శిలాఫలకాలను జేసీబీలతో మీరే ధ్వంసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆధునీకరణ కావాలి అని అడిగితే జగన్ ఏమీ చేయలేదన్నారు.. ఇన్ని అబద్ధాలు నేను ఎక్కడా చూడలేదు అంటూ వంగా గీతపై ఫైర్ అయ్యారు.. ఏలేరు ఎందుకు ఆగిపోయిందో చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ.
అందెశ్రీ పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి..
సహజ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అంత్యక్రియలకు హాజరై కవికి కన్నీటి వీడ్కోలు చెప్పారు. ఇక, అందెశ్రీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన అనంతరం ఆయన పాడెను స్వయంగా సీఎం మోశారు. ఈ సందర్భంగా అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చారు రేవంత్. ఆయన వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, భారీ సంఖ్యలో అభిమానులు, సాహితీ ప్రియులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
కిల్లర్ డాక్టర్లు.. కారు పేలుడులో ఆ నలుగురి భాగస్వామ్యం ఇలా!
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోటకు ఎదురుగా జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఎర్రకోట పేలుడు ఆత్మాహుతి దాడి అని భద్రతా సంస్థలు అంటున్నాయి. కారు బ్లాస్ట్‌కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మద్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలిపాయి. దాడికి కారణమైన నలుగురు కిల్లర్ డాక్టర్లు ఎవరు?, ఎందుకు దాడికి పాల్పడ్డారనేది చూద్దాం.
రాష్ట్ర భవిష్యత్తుకు పరిశ్రమలు ఎంతో కీలకం.. రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు పరిశ్రమలు ఎంతో కీలకమైనవి.. విశాఖలో జరగనున్న సమ్మిట్ ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి.. తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి పి. నారాయణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా కాకినాడ మ్యాట్ మైరైన్ షిప్పింగ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ యార్డ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ యార్డ్‌ను ఏపీఐఐసీ సేకరించిన 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కాకినాడ సముద్రతీర పరిశ్రమల విస్తరణకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభించనుంది.
జమ్మూ కాశ్మీర్ చరిత్ర.. 65 ఏళ్ల తర్వాత విజయం!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. దేశీయ దిగ్గజం ఢిల్లీపై రంజీ ట్రోఫీలో తొలి విజయాన్ని అందుకుంది. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో గ్రూప్ డి మ్యాచ్‌లో ఢిల్లీని 7 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ ఓడించింది. ఆరు దశాబ్దాల తర్వాత విజయం దక్కడంతో ప్లేయర్స్ మైదానంలోనే ఘనంగా సంబరాలు చేసుకున్నారు. పరాస్ డోగ్రా, అకిబ్ నబీ, కమ్రాన్ ఇక్బాల్, వంష్ శర్మలు జమ్మూ కాశ్మీర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ చారిత్రాత్మక విజయంతో జమ్మూ కాశ్మీర్ ఎలైట్ గ్రూప్ Dలో రెండవ స్థానానికి చేరుకుంది. ముంబై అగ్రస్థానంలో ఉంది.
ఒకప్పుడు ఏపీ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు..
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఛీ ఛీ అనేవాళ్లు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు.. ఇదే సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కనిగిరి కనకపట్నం అవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కనిగిరి కనకపట్నం కావడానికి ఎంతో కాలం పట్టదు అన్నారు.. తుఫానులో సమర్థవంతంగా పనిచేశాం. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పని చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించాం అని పేర్కొన్నారు.. చదువుకుంటున్న విద్యార్థులకు చదువులు పూర్తయ్యలోపు స్థానికంగా ఉపాధి కల్పించే బాధ్యత నాది అని తెలిపారు.. అందరూ ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు.. కానీ, ఇంటికొక వ్యాపారవేత్తని చేస్తామని హామీ ఇచ్చాను. నేను చేసిన పనులే సాక్షాలు అన్నారు.. 25 ఏళ్ల క్రితం అభివృద్ధి ప్రారంభిస్తే హైదరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు..