CM Chandrababu: నగరి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2024కు ముందు రాష్ట్రం పూర్తిగా అతలాకుతలం అయిందన్న ఆయన.. నోటీసులు కూడా ఇవ్వకుండా తనను రాత్రికి రాత్రే అరెస్టు చేశారని, గత ఐదేళ్లుగా కనీసం మాట్లాడాలన్నా, నవ్వాలన్నా వీలుకాని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత భయంకరమైన పాలన ఐదేళ్లపాటు కొనసాగిందని ఆయన విమర్శించారు.
Read Also: Nihilist Penguin: ఈ పెంగ్విన్ స్టోరీ మీమ్ కాదు.. మైండ్ షేక్ చేసే కథ.. అది చివరికి చనిపోయిందా?
చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, “చెడు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకూడదు. గత ఐదేళ్ల పాలన ఒక రాక్షస పరిపాలనలా సాగింది. నేరస్థులు రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎలా నాశనమవుతుందో ప్రజలు చూశారు” అని వ్యాఖ్యానించారు. మూడు పార్టీలు కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేశామని, అదే కూటమి విజయం సాధించడానికి కారణమైందని తెలిపారు సీఎం చంద్రబాబు… తాను చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, కానీ ఇంత వేగంగా, ఇంత విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని చంద్రబాబు చెప్పారు.
నగరి టీడీపీకి కంచుకోట
నగరి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రజల కోసం చివరి శ్వాస వరకు పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గాలి భాను ప్రకాష్ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ముద్దుకృష్ణమ నాయుడు కంటే ఇంకా మెరుగ్గా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇక, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అసాధ్యమని కొందరు అన్నారని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని సూపర్ హిట్‌గా అమలు చేసి చూపించిందని చంద్రబాబు స్పష్టం చేశారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఐదేళ్లలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ
పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు చంద్రబాబు.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. సర్క్యులర్ ఎకానమీ భాగంగా నాన్-రీసైక్లబుల్ ప్లాస్టిక్‌ను కూడా సంపదగా మార్చే ప్రక్రియపై అధికారులు ఇచ్చిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు.