తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే సంచలన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ఘట్టానికి చేరుకుంది. సుమారు 600 పేజీల సుదీర్ఘమైన తుది ఛార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో సీల్డ్ కవర్లో సమర్పించారు. ఈ సమగ్ర నివేదికలో కల్తీ నెయ్యి సరఫరా వెనుక ఉన్న భారీ కుంభకోణాన్ని, నిందితుల పాత్రను ఆధారాలతో సహా పొందుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చగా, ఇందులో డైరీ నిర్వాహకులతో పాటు టీటీడీ ఉద్యోగులు , డైరీ నిపుణులు కూడా ఉండటం గమనార్హం. గతంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్లకు అదనంగా, లోతైన విచారణ తర్వాత మరికొందరి పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం.
Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!
సిబిఐ నేతృత్వంలో జరిగిన ఈ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవని, బయట నుండి పాలు కూడా సేకరించకుండానే నెయ్యిని ఎలా ఉత్పత్తి చేశారనే అంశంపై సిట్ ఆధారాలను సేకరించింది. పామాయిల్లో వివిధ రకాల రసాయనాలు కలిపి నెయ్యిని పోలిన మిశ్రమాన్ని తయారు చేసి, దానిని ఏఆర్ డైరీ , వైష్ణవి డైరీల ద్వారా తిరుమలకు సరఫరా చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. దాదాపు 68 లక్షల కిలోల ఈ కల్తీ మిశ్రమంతో సుమారు 20 కోట్ల లడ్డూలను తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సరఫరాకు సంబంధించి వివిధ డైరీలకు సుమారు 251 కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్లు ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ భారీ కుంభకోణంపై విచారణలో భాగంగా టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి కీలక వ్యక్తులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. రాజకీయంగా , ఆధ్యాత్మికంగా దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసులో, సిట్ సమర్పించిన ఈ 600 పేజీల ఛార్జ్‌షీట్ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ఈ నివేదికను పరిశీలించిన తర్వాత వెలువడే ఆదేశాల ఆధారంగా మరిన్ని అరెస్టులు , కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు ఏసీబీ కోర్టు, ఇటు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తాయన్న దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Divi Vadthya : పెళ్లి.. విడాకుల కంటే అదే బెటర్.. దివి షాకింగ్ కామెంట్స్!