కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రాజకీయం రసవత్తరంగా మారింది. అక్కడ రాజకీయం రగులుతోంది. ఒకపక్క స్దానిక శాసనసభ్యుడు ఆమరణ నిరాహారదీక్షకు దిగగా మరోపక్క 19 వ ప్రజా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యానాంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పటిష్ఠమైన భద్రతా ఏర్పట్లను చేసారు. యానాంలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న పదిహేను సమస్యలను పరిష్కరించాలంటూ రెండు నెలలక్రితం యానాం శాసనసభ్యుడు గొల్లపల్లి అశోక్ పుదుచ్చేరి అసెంబ్లీ ఎదుట నిరాహారదీక్షకు దిగారు..
ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన హామీతో అదేరోజున దీక్షను విరమించారు. రెండునెలలు కావస్తున్నా ముఖ్యమంత్రి తనకు ఇచ్చి హామీని నెరవేర్చకపోవడంతో ముఖ్యమంత్రి రంగస్వామిపై గొల్లపల్లి అశోక్ తీవ్ర వాఖ్యలు చేసారు..హామీలను నెరవేర్చి యానాంకు వస్తే పూలతో స్వాగతం పలుకుతామని, లేకపోతే చెప్పుదెబ్బలతో స్వాగతం పలుకుతామని గొల్లపల్లి అనడంతో యానంలోనే కాకుండా పుదుచ్చేరి వ్యాప్తంగా నిరశనలు చెలరేగాయి. తనకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదంటూ గొల్లపల్లి యానాంలో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు..శుక్రవారం ఉదయం నుండి ఆయన దీక్షకు దిగారు.
శనివారం ఆయన అభిమానులు యానాంబంద్ కు పిలపునివ్వటంతో యానాం లో పలు దుకాణాలు మూతపడ్డాయి..ప్రస్తుతం యానాంలో 19 వ ప్రజా ఉత్సవాలు జరుగుతుండటంతో అ ఉత్సవాల ముగింపురోజున ముఖ్యమంత్రి రంగస్వామి యానాం రానుండటంతో సర్వత్రా టెన్సన్ వాతావరణం నెలకొంది..8 వతేదీ ఆదివారం గొల్లపల్లి ఆమరణ నిరాహారదీక్ష మూడవ రోజుకు చేరుకోగా అదేరోజున ముఖ్యమంత్రి రంగస్వామి యానాంలో అడుగుపెట్టనున్నారు..గొల్లపల్లి దీక్షకు ఆంద్రప్రదేశ్ చెందిన పలు రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. గొల్లపల్లికి ఏమైనా అయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని వైకాపా ఎమ్.ఎల్.సి తోట త్రిమూర్తులు పుదుచ్చేరి పెద్దలకు హెచ్చరికలు జారీచేసారు..ముందు ముందు ఏమిజరగబోతుందోనని యానాం ప్రజలు ఆందోళన చెందుతున్నారు..