ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులకు… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. కొందరు విద్యార్థులు… ఆయనకు కృతజ్ఞతలు తెలపగా… మరికొందరు కేంద్ర మంత్రితో సెల్ఫీలు దిగారు. విద్యార్థులు ఇండియాకు రావడానికి సహకరించిన రోమేనియా ఎంబసీ అధికారులకు కేంద్రం తరపున పీయూష్ కృతజ్ఞతలు చెప్పారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 27, ఆదివారం దినఫలాలు
ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇండియా చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ వెళ్లిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో ఏపీ, తెలంగాణకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు మొదటి విడతలో భారత్‌కు చేరుకున్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ రిసీవ్ చేసుకున్నారు. ఈ విమానంలో ఏపీకి చెందిన రాజుల పాటి అనూష, సిమ్మ కోహిమ వైశాలి, వేముల వంశి కుమార్, అభిషేక్ మంత్రి, జయశ్రీ ,హర్షిత కౌసర్, సూర్య సాయి కిరణ్ ఉండగా.. తెలంగాణకు చెందిన వివేక్, శ్రీహరి, తరుణ్, నిదిష్, లలితా, దేవి, దివ్య, మనీషా, రమ్య, ఐశ్వర్య, మాన్య, మహిత, ప్రత్యూష, గీతిక, లలిత, తరణి ఉన్నారు.
ఉక్రెయిన్ లో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 550 మంది వైద్య విద్యార్థులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి 260, తెలంగాణ నుంచి 275 మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌లో చదువుతున్నట్లు సమాచారం. జఫ్రోజియా వర్సిటీలోనే 1400 మంది భారతీయ వైద్య విద్యార్థులు ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు 800 కి.మీ రైలులో తీసుకొచ్చి..అక్కడ నుంచి విమానంలో తరలించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్ కు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. విద్యార్థులను హైదరాబాద్ కు చేరవేయడానికి ప్రభుత్వం ఉచితంగా టికెట్లను అందిస్తుందన్నారు.