గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు బూతు పురాణాల రాజకీయంతో జనాలకు అసహ్యం వేస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కొడాలి నాని, వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని పశువులకన్నా హీనంగా మాట్లాడారు… జగన్ అరాచక పాలనపై మేము మా నాయకుడు చంద్రబాబు నాయడు మాట్లాడితే మాపై శాపనార్థాలు పెడతారా అంటూ దేవినేని ఉమ ఫైర్ అయ్యారు.
దేవినేని ఉమ మాట్లాడుతూ ..తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేలా తెలుగు దేశాన్ని, తెలుగుదేశం అధినేతను ఉద్దేశించి, నీచమైన భాష మాట్లాడుతున్నారు. పరిటాల రవి బొమ్మ పెట్టుకొని తిరిగిన వ్యక్తి, నేడు సునితమ్మ ను ఉద్దేశించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. బూతులు మాట్లాడే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు తరిమి తరిమి కొడతారు. జగన్ కల్లల్లో ఆనందం చూడటానికి, హైదరాబాద్ లోని మీ ఆస్తులను కాపాడుకోవడానికి ఇంత నీచంగా మాట్లాడతారా? రాజీనామా పత్రాలు మాకు పంపించడం కాదు.. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇస్తే సరిపోతుంది అని సూచించారు.. గన్నవరం ఇంఛార్జ్ గా బచ్చు అర్జునుడిని నియమించామని వెల్లడించారు దేవినేని ఉమ.
మూడు కార్లు, 20 మందిని వెంటేసుకొని తిరిగితే మీ రౌడీయిజానికి భయపడాలా? అంటూ కొడాలి నానీ ఉద్దేశించి దేవినేని ఉమ మాట్లాడారు. కొడాలి నాని గుర్తు పెట్టుకో… ఎన్టీఆర్ భిక్షతోనే నువ్వు ఈనాడు ఆ స్థాయిలో ఉన్నావని గుర్తుంచుకో, కొడాలి నాని భాషతో ప్రతి టీడీపీ కార్యకర్త రక్తం ఉడికిపోతుందన్నారు. రాజీనామాలు చేయకుండా మీడియా ముందు బూతులు మాట్లాడటం మగతనం కాదని, కృష్ణా జిల్లాలో కొడాలి నాని, వంశీ చేస్తున్న దోపిడీని, అవినీతిని ఎవరు అడిగినా చెబుతారన్నారు.
పట్టాభి ఇంటిపై, టీడీపీ కార్యాలయంపై దాడి చేయించిన వారికి, చేసిన వారికి ఈ ముఖ్యమంత్రి 1 ప్లస్ 1 గన్ మెన్లను ఇస్తామంటారా? దానర్థం మరింతగా దాడులు చేయమని ఈ ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడా? కొడాలి నాని, వల్లభనేని వంశీల భాషపై సీఎం సమాధానం చెప్పాలి. పేకాట ఆడించడం, లారీలకు బాడీలు కట్టించడం తప్ప, ఈ నానికి ఏమైనా తెలుసా? తన శాఖలో ఏంజరుగుతోందో తెలుసా? రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే , ఈ నాని ఏం చేస్తున్నాడు? కొడాలి నాని, లోకేష్ పెళ్లి జరిగినప్పుడు ఇంటిముందు తాటాకుల పందిరి వేశాడు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలోని అరాచకాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లడంతో ఏపీ ప్రభుత్వం గంగ వెర్రులెత్తిపోతుందని దేవినేని ఉమ అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై దేవినేని ఉమ సీఎంకు కౌంటర్
సాగు నీటి ప్రాజెక్టులపై రూ. 65 వేల కోట్లను ఏ ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు పెట్టామో ఆధారాలతో ఇస్తాం. వాటిపై సమాధానం చెప్పగల ధైర్యం ఈ మంత్రికి ఉందా? అధికారంలోకి వచ్చి 29 నెలలైంది. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? మా ప్రభుత్వంలో 62 ప్రాజెక్టులకుగాను, 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 26 ప్రాజెక్టులు పనులు పరుగులు పెట్టించాము. 13 ప్రాజెక్టులు పైపులైనులో ఉన్నాయి. ఇదీ మే 2019 నాటి ముఖచిత్రం. ఎప్పుడూ రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడే మంత్రి , నేడు ఆ మాటే ఎత్తలేదు. పోలవరం సహా , ఈ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంపిక చేసిన 6 ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి? కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఈ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లాడు..? ఎవరిని అడిగి వెళ్లాడు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు దేవినేని.
పీక్ టైమ్ లో తెలంగాణ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేసుకుంటుంటే ఈ ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని కూర్చొన్నాడని ఫైర్ అయ్యారు దేవినేని ఉమ. గోదావరి, కృష్ణా నదులపై ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారం ప్రాజెక్టులు కడుతుంటే, ఈ ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవడు. కేంద్ర జలవనరుల మంత్రితో మాట్లాడి, రాష్ట్రానికి న్యాయం చేయమని ఎందుకు అడగడు..? టీడీపీ ప్రభుత్వం, సమగ్ర జల విధానంతో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తే, ఈ మంత్రి, ముఖ్యమంత్రి పూర్తిగా సాగునీటి రంగాన్ని చతికిలా పడేలా చేశారు. రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు..? ఎవరికి ఎంతిచ్చారో, ఏ ప్రాజెక్ట్ లో ఎంత పనులు జరిగాయో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయగలదా? పాలమూరు-రంగారెడ్డిపై ఎప్పుడో హైకోర్టులో రిట్ పిటిషన్లు వేశాం. ఈ సీఎంకు అంత దమ్ముందా అని దేవినేని ఉమ సీఎం జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.