తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీతో పాటు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకు ఆత్మగౌరవాన్ని సంపాదించిపెట్టిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీడీపీ 40 వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని కూడా ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు.
కాగా రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో తెలుగు దేశం పార్టీని ఆయన స్థాపించారు. పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే ఆయన అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కిలో బియ్యం రెండు రూపాయలకే అందించి పేదల ఆకలి తీర్చారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో సత్తా చాటిన ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని చాలా కాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ 1982 నుండి నేటి వరకు అనేక ఒడిదొడుకుల మధ్య తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ వస్తోంది.