ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏపీకి మూడు రాజధానులు అనే వైసీపీ ప్రభుత్వం చెప్పిందని.. తాజాగా మూడు రాజధానులు పోయి.. నాలుగో రాజధాని హైదరాబాద్ కూడా వచ్చి చేరిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనకు అన్ని విధాలుగా ఉపయోగపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవడానికి జగన్ ఏపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ నేతల మనసులో ఎంత కుట్ర దాగుందో మరోసారి బయటపడిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఇంకా హైదరాబాద్‌నే ఏపీ రాజధానిగా భావిస్తున్నారని.. చివరకు వారికి మిగిలేది అదేనన్నారు. విభజన చట్టంలో ఏపీకి రావాల్సిన అంశాలపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఇంతకంటే ఏం కావాలని.. జగన్ మౌనంగా ఉండటమే కావాలన్నారు. కాలేజీల్లో ర్యాగింగ్‌ను తలదన్నేవిధంగా అసెంబ్లీలో టీడీపీ నేతల విషయంలో వైసీపీ నేతలు బరితెగిస్తున్నారని పయ్యావుల తీవ్రంగా మండిపడ్డారు.