పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన పాలకొల్లు టూ అసెంబ్లీ సైకిల్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలంటూ ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్ర చేపట్టారు. అయితే పాతూరు-గుండుగొలను హైవే మధ్యలో సైకిల్ యాత్ర చేస్తున్న రామానాయుడు అభిమానులకు అభివాదం చేస్తూ ప్రమాదవశాత్తూ సైకిల్ నుంచి జారి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
కాగా నిమ్మల సైకిల్ నుంచి జారిపడడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. రోడ్డుపై పడిన ఎమ్మెల్యేకు స్థానికులు సపర్యలు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రథమ చికిత్స అనంతరం నిమ్మల సైకిల్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన ఏలూరులో జిల్లా కలెక్టర్‌ను కలిసి టిడ్కో ఇళ్ల అంశంపై వినతిపత్రం అందజేశారు. అంతకుముందు భీమడోలు చేరుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు స్వాగతం పలికారు.