రాబోయే కాలంలో హీరోలే గెలుస్తారు గానీ, విలన్లు గెలిచే పరిస్థితి లేదు. మిగిలిన రెండున్నరేళ్లు జగన్ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో అల్లకల్లోలానికి నాంది పలికాడు. వేలాది మంది రైతులను, వారి కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేశారు. కోర్టులు మొట్టికాయలు వేస్తాయనే నిన్న ఉన్నపళంగా మూడు రాజధానుల బిల్లుని వెనక్కు తీసుకున్నారు. సీఎం జగనుకు నిజంగా చిత్తశద్ధి ఉంటే రాజధాని రైతులు, మహిళలకు క్షమాపణ చెప్పి, రాజధానిగా అమరావతినే కొననసాగిస్తామని అసెంబ్లీలో చెప్పాలి అన్నారు.
ఇది వరకటి నిర్ణయంతో ఎన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, ఎందరు రైతులు, మహిళల ఉసురు తీశారో తెలియదా… అన్నం పెట్టే రైతుపై, జన్మనిచ్చే మహిళపై, యువతపై, ఎస్సీ ఎస్టీలపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. అమరావతిలోని లక్షల విలువైన భూములను అమ్ముకోవడానికే జగన్ కొత్తనాటకానికి తెరలేపారని ప్రజలే అంటున్నారు. విశాఖలో ఇప్పటికే భూములు అమ్మకాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మాటతప్పను, మడమతిప్పను అనే మాట జగన్ నోటిసనుంచి వినీ వినీ విసుగొచ్చేసింది అని పేర్కొన్నారు.