అమరావతి పరిరక్షణ కోసం రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నా అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది పాదయాత్ర కాదు… రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర. రాష్ట్ర భవిష్యత్ కోసం కన్నతల్లి లాంటి భూముల్ని త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమం. ఈ మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలి. అహంకారంతో మూసుకుపోయిన ముఖ్యమంత్రి కళ్లు తెరుచుకోవాలి. పగలు, ప్రతీకారాలు, కూల్చివేతలు, రద్దులపై చూపుతున్న శ్రద్ద రాష్ట్రాభివృద్ది పై చూపడం లేదు. విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్… అమరావతి నిర్మాణంతో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతున్న తరుణంలో 3 రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం. అమరావతిని కాపాడుకోలేకపోతే రాష్ట్రం అంధకారమవుతుతుంది అని చంద్రబాబు సూచించారు.