ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై టీడీపీ వినూత్న నిరసనలకు శ్రీకారం చుట్టింది. ఉగాది పర్వదినం రోజు కూడా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు విజయవాడలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎండా కాలంలో ప్రజలు ఏసీలు వాడొద్దని ప్రభుత్వాధికారులు ఎలా చెప్తారని ఆయన ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు రాకుండా ఉండాలంటే ఏసీలు వాడొద్దని చెప్పడం చోద్యంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఆఫీసులో, సీఎం ఇంట్లో ఏసీలు వాడకుండా ఉండగలరా అంటూ నిలదీశారు. ప్రజలకు నీతులు చెప్పే అధికారులు సీఎం ఆఫీసులో ఏసీలు వాడకుండా ఫ్యాన్ వేసుకోండి అని చెప్పగలరా అని మండిపడ్డారు.
మరోవైపు టీడీపీ నేత నాగుల్ మీరా కూడా ప్రభుత్వం విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమని.. పైగా తగ్గిస్తామని చెప్పి రాష్ట్ర ప్రజల చెవిలో జగన్ పూలు పెట్టారని ఆరోపించారు. 2024లో రాష్ట్ర ప్రజలు జగన్ చెవిలో పూలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. జగన్ అండ్ టీం అవినీతికి పాల్పడటం వల్లే ఆ భారం రాష్ట్ర ప్రజలపై పడుతుందని విమర్శించారు.
https://ntvtelugu.com/ugadi-panchangam-in-ap-cm-jagan-camp-office/