ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పీఆర్సీ అంశం కంటే గుడివాడ క్యాసినో కథ.. రంజుగా మారింది. టీడీపీ నేతలు మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు. రోజుకో ట్విస్ట్ ఇందులో బయటపడుతోంది. తాజాగా టీడీపీ మహిళా నేత అనిత తీవ్రంగా స్పందించారు. ఏపీలో గోవా కల్చర్ తీసుకురావడం ద్వారా రాష్ట్రానికి వైసీపీ నేతలు మచ్చ తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయంపై హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా కనీసం నోరు కూడా విప్పడం లేదని అనిత అన్నారు. టీడీపీ హయాంలో విశాఖ బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఓ సంస్థ ముందుకు వస్తే అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఎంత రచ్చ చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.
కేసినో వ్యవహారంపై సుచరిత, జబర్దస్త్ నటి రోజా ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా మౌనంగా ఉన్నారని విమర్శించారు. గతంలో ఏపీ అంటే గంజాయి, డ్రగ్స్ గుర్తుకువచ్చేవని, కానీ ఇప్పుడు క్యాసినోలు గుర్తుకువస్తున్నాయని అనిత ఎద్దేవా చేశారు. కేసినోలోని టెంట్లన్నీ వైసీపీ రంగుల్లోనే ఉన్నాయని.. అయినా దాంతో తనకు సంబంధం లేదని కొడాలి నాని అంటున్నారని దుయ్యబట్టారు. సినిమా టికెట్ ను రూ. 10 చేశారని… కేసినో ఎంట్రీ టికెట్ మాత్రం రూ. 10 వేలు పెట్టారని అన్నారు. కేసినోను పేదలకు అందుబాటులోకి తీసుకొస్తారా? అని ఎద్దేవా చేశారు. కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
విశాఖ బీచ్ ఫెస్టివల్ పై అప్పట్లో చంద్రబాబు మాట్లాడుతూ, సంస్కృతిని నాశనం చేసే పనులను అంగీకరించబోమని అన్నారని అనిత గుర్తు చేశారు. ఇప్పుడు కేసినో గురించి ఇంత వివాదం జరుగుతున్నా జగన్ మాత్రం మౌనంగానే ఉండడం దేనికి సంకేతం అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలన్నారు.