ఏపీలో టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. మొత్తం 12 మందిని శుక్రవారం జరిగే సమావేశానికి రావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఈ జాబితాలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా క్రియాశీలకంగా లేరు. అయితే ఓ సారి బీజేపీలో చేరుతారని.. మరోసారి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అటు ఖండించలేక.. ఇటు అంగీకరించలేక గంటా సైలెంట్‌గానే ఉన్నారు. మధ్యలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా అది ఆమోదం పొందలేదు.
ఒకవేళ శుక్రవారం జరిగే సమావేశానికి గంటా హాజరుకాకపోతే ఆయన నియోజకవర్గానికి వేరే ఇంఛార్జిని చంద్రబాబు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో గంటా భవితవ్యం ఏంటో శుక్రవారం తేలిపోనుంది. ఒకవేళ సమావేశానికి ఆయన రాకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ మారతారని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా మనసు మార్చుకుని సమావేశానికి వస్తే టీడీపీలోనే కొనసాగే అవకాశాలున్నాయి. ఇటీవల గంటా యాక్టివ్ అయ్యారని… ఓ కార్యక్రమం సందర్భంగా తన నియోజకవర్గం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారని… వాటిలో చంద్రబాబు ఫోటోలను పెట్టారని టీడీపీ నేతలు చెప్తున్నారు.