ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ మాజీ మంత్రికి ఓ జూనియర్ ఎమ్మెల్యే వర్గం చెక్ పెడుతోంది. 30 ఏళ్ల అనుభవంలో ఎన్నడూ చూడని పరిణామాలు సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాలలు రగిలించాయ్. వర్గ రాజకీయాలతో విసిగెత్తిపోయిన ఆయన ఎక్కువ కాలం భరించడం కష్టం అనుకున్నారో ఏమో కానీ…కుండబద్దలు కొట్టేశారు. నాకు సీఎం తప్ప బాస్‌లు ఎవరూ లేరని బహిరంగంగానే ప్రకటించి సరికొత్త చర్చకు తెరతీశారు.
విశాఖ జిల్లా అనకాపల్లి వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు బలమైన రాజకీయ ప్రత్యర్ధులు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా, మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా పని చేసిన అనుభవం వీర భద్రరావుకి ఉంది. ఎప్పుడూ రాజకీయంగా ప్రత్యర్ధితోనే పోరాటం చేసిన దాడికి తొలిసారి వింతైన అనుభవం సొంత పార్టీ నుంచే ఎదురవుతోంది. అధికార పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్‌కు మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే.
ఐతే…ఇటీవల ఆ దూరం బాగా పెరిగిపోవడమే కాదు…ఒకరి వర్గంను మరొకరు టార్గెట్ చేసుకునే స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు మాజీ మంత్రిని ఆహ్వానించకుండా పక్కన పెట్టేసిందట ఎమ్మెల్యే గ్రూప్. తమతో కలిసి రావడం లేదని హైకమాండ్‌కు చెప్పేందుకు ఇలా కుట్ర చేస్తున్నారని దాడి వర్గం భావిస్తోంది. ఇటీవల నెహ్రు చౌక్‌లో చేపట్టిన జనాగ్రహ దీక్షకు పిలవని పేరంటమే అయినా దాడి వెళ్లివచ్చారు. దీనికి కారణం ఉందట. చంద్రబాబుకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి వెళ్లకపోతే టీడీపీకి తాను అనుకూలం అనే ప్రచారం చేస్తారనే అనుమానంతోనే వెళ్లారట. జగన్ పాదయాత్రకు నాలుగేళ్లు అయిన సందర్భంగా ఎమ్మెల్యే వర్గం, దాడి గ్రూప్ వేరు వేరుగానే ర్యాలీలు నిర్వహించాయి.
ఐతే..ఇలా చూస్తూ వదిలేస్తే ఎమ్మెల్యే వర్గం రాజకీయంగా దెబ్బ తీయవచ్చనే అనుమానం దాడిలో కనిపిస్తుందట. అందుకే ఎమ్మెల్యే వర్గం పిలిచినా..పిలవకపోయినా..కార్యక్రమాలకు వెళ్లటంతో పాటు..తనకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ లేదనే విషయాన్ని బహిర్గతం చేయటం ద్వారా..ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నది దాడి ప్లాన్ అట.
ఇక…అదే వేదికపై నుంచి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు సీఎం ఒక్కరే బాస్ అని జగన్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని కుండ బద్దలు కొట్టేశారు. తద్వారా ఎమ్మెల్యే అమర్నాథ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదనే సంకేతాలు పంపించారు వీరభద్రరావు. ఈ పరిణామాల వెనుక పవర్ పాలిటిక్స్ కారణం అనేది అనకాపల్లి గురించి తెలిసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది.