కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల ప్రాణాలు తీసింది.. పోలీసుల విభాగంలోనూ పెద్ద ఎత్తున కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.. తాజాగా.. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనా మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా పేరుపొందిన ఆయన.. కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఇవాళ ఆయన పరిస్థితి మరింత విషమించి కన్నుమూశారు.. కృష్ణ జిల్లా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో నాన్-కేడర్ ఎస్పీగా పనిచేస్తున్న రామ్ ప్రసాద్… 1995లో పోలీసు విభాగంలో చేరారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కేడర్‌కు కేటాయించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఎదగడానికి ముందు, రామ్ ప్రసాద్ విజయవాడ నగరంలో అదనపు ట్రాఫిక్ డీసీపీగా పనిచేశారు.. ముఖ్యమంత్రి భద్రతా విభాగంలో కూడా పనిచేశారు రామ్ ప్రసాద్. ఇక, ఆయన మృతికి పలువురు పోలీసులు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.