కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. అయితే, కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలను కూర్చోవడం చర్చగా మారింది.. మరోవైపు.. పలు ప్రాంతాల్లో బీజేపీ ఏజెంట్లను ఇబ్బందులకు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.. మరోవైపు.. ఎస్సై చంద్రశేఖర్‌పై ఎస్పీ అన్భురాజన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… దీంతో.. ఎస్సై చంద్రశేఖర్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు అధికారులు..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. గోపవరం మండలం బుట్టాయిపల్లి, జోగిరెడ్డి పల్లి గ్రామాల్లో తిరుగుతూ బీజేపీ నాయకులపై బెదిరింపులకు పాల్పడిన ఎస్సై చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరామని తెలిపారు.. ఇక, తిరువెంగళాపురం పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాలు లేవన్న ఆయన.. పోరుమామిళ్లలో బయట వ్యక్తులు మొహరించారని ఆరోపించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది.. కానీ, లోపాయికారిగా బీజేపీకి సహకరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక, కొన్ని పోలింగ్ బూతుల్లో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా కూర్చోవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.