ఏపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి విమర్శలు చేశారు. సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకోవాలో ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల పోటీలు, హరిదాసుల పాటలు అని.. కానీ వైసీపీ సర్కారు క్యాసినో సంస్కృతిని తీసుకొచ్చి పండగ వాతావరణాన్ని అబాసుపాలు చేసిందని మండిపడ్డారు. ఏపీలో జిల్లాల విభజనపై ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చిందని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు.
Read Also: అప్పుడు తెలంగాణలో.. ఇప్పుడు ఏపీలో.. సీఎం వద్ద మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్
కేంద్రం నుంచి వస్తున్న నిధులు, రాష్ట్రంలో పరిస్థితులపై ఏ వేదికపైనైనా మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సోము వీర్రాజు తెలిపారు.ఏపీ ఆర్థికంగా నష్టపోయిందని… ఆదాయం వచ్చే మార్గాలన్నీ అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శలు చేశారు. ఒక్క ఇసుక ద్వారా ఏటా 5వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని.. కానీ ఆ పద్ధతిని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిందని ఆరోపించారు. బస్టాండ్లు, రోడ్లకు దిక్కులేదు కానీ జిల్లాకో విమానాశ్రయాలు కడతామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
ప్రజలు బాడీ మసాజ్ కావాలనుకుంటే జగన్ వేసిన రోడ్లపై తిరిగితే సరిపోతుందని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు విజయనగరం నుంచి రాయ్‌పూర్ వరకు రూ.వేల కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు వేస్తోందన్నారు. కానీ రూ.2 వేల కోట్లు పెట్టి జగన్ ప్రభుత్వం రోడ్లు వేయలేకపోతోందని విమర్శించారు. మరోవైపు ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. అధికార యంత్రంగంపై ప్రభుత్వం పట్టుకోల్పో యిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదని.. కార్మికులు నిశ్చింతగా ఉండాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.