నిన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పటికైనా మారవా..? అంటూ చురకలు అంటించారు. పెట్రోలుపై 31 శాతం వ్యాట్ + రూ.4+రూ.1.. డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ +రూ.4, +రూ.1 పన్నులు వేసి 151 సీట్లు ఇచ్చిన ప్రజలను బాదేస్తావా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ వైపు కేంద్రం మరోవైపు పొరుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంటే మీరు మాత్రం స్పందించరా..? అని ఆయన ప్రశ్నించారు.
వ్యాట్ లో కనీసం 5 శాతంతో పాటు అదనంగా మీరు వేస్తున్న రూ.5 పన్ను తగ్గించినా లీటర్ కు రూ.10 భారం తగ్గుతుందని సోమిరెడ్డి హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ మరోవైపు రూ. 1.10 లక్షల కోట్లు ఎరువులపై రాయితీ ప్రకటించిందని, దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా ఏపీ ప్రజలపై మాత్రం మీరు కనికరం చూపరా..? అని ఆయన మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి కుమ్ముడే కుమ్ముడు అంటూ మరింత కుమ్మేస్తారా..? అని ఆయన ఎద్దేవా చేశారు.