Steel Plant: కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. తాజాగా కడప స్టీల్‌ప్లాంట్ కోసం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశమైంది. ఈ మేరకు కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ అమోదముద్ర వేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేయనున్న పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు కూడా ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. దీంతో వీలైనంత త్వరగా ప్లాంట్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో వెనుకబడ్డ రాయలసీమ ముఖచిత్రం మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Single Cigarettes Sales Ban: పొగరాయుళ్లకు బిగ్ షాక్.. ఇక, ఇలా అమ్మలేరు.. తాగలేరు..!
కాగా కడప జిల్లాలో సున్నపురాళ్లపల్లెలో రెండు విడతల్లో మొత్తం రూ.8,800 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. మొదటి విడతలో రూ.3,300 కోట్ల పెట్టుబడి పెడతారు. తొలి దశలో ఏడాదికి 1 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు, రెండో విడతలో ఏడాదికి 2 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులు తయారు చేస్తారు. ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా కడప స్టీల్‌ప్లాంట్‌తో పాటు పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీలో అనుమతులు జారీ చేశారు. 600 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు కూడా ఎస్‌ఐపీబీ పచ్చజెండా ఊపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టులో రూ.6,330 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 4వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోటలో వేయి మెగావాట్లు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల పరిధిలో రైవాడ వద్ద 600 మెగావాట్ల ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తారు.
అటు రూ. 8,855 కోట్లతో 2100 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టును షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎర్రవరం, సోమశిల వద్ద రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనుంది. ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల ప్రాజెక్టు, 900 మెగావాట్ల రెండో ప్రాజెక్ట్ సోమశిల వద్ద ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది జులైలో ప్రారంభమై ఐదేళ్లలో అంటే డిసెంబర్ 2028 నాటికి పూర్తిచేసి ప్రత్యక్షంగా 2100 మందికి ఉపాధి కల్పించనుంది.
సీఎం శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం. ౩ ప్రాజెక్టులకు ఆమోదం. కడపజిల్లా సున్నపురాళ్లపల్లెలో రూ.8,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్. త్వరలో పనులు ప్రారంభం. అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ పంప్డ్ హైడ్రోస్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం. మొత్తంగా రూ.23,985 కోట్ల పెట్టుబడులు. pic.twitter.com/KAaFhEUktP
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 12, 2022