విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీటిపై విస్తృతంగా దాడులు నిర్వహించి, వందల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. వీరిపై పోలీస్ కేసులతో పాటు బైండోవర్ కేసులు నమోదుకు చర్యలు తీసుకిన్నారు. దీనిలో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటికే పట్టుకున్న 89 మంది నిందితులను గురువారం రోలుగుంట తహశీల్దారు శ్రీనివాసరావు ఎదుట హాజరు పరిచి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసేలా ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా తాహశీల్ధారు శ్రీనివాసరావు వారితో మాట్లాడారు. నాటుసారా తయారీ, అమ్మకం చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతానికి బైండోవర్ తో సరిపెడుతున్నామని, మరోసారి ఇదే పని చేస్తే లక్ష జరిమానా లేదా ఆరు నెలలు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.