పార్టీ గుర్తు మీద జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీ ని ఆశీర్వదిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ స్వీప్ చేస్తుంది అని తెలిసే చంద్రబాబు గత ఏడాది కోవిడ్ వంకతో వాయిదా వేయించారని అన్నారు. సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చిన తీరు కూడా ఈ ఫలితాలకు ఒక కారణం అని అన్నారు. ఎస్ఈసీ వాలంటీర్ల పై పెట్టిన ఆంక్షలు అసంబద్ధ అని కోర్టు కూడా స్పష్టం చేసిందని అన్నారు. నామినేషన్లు మళ్లీ వేయమని టీడీపీ నాయకులకు ఎస్ఈసీ అవకాశం కల్పించడం అధికార దుర్వినియోగం చేయడమేనని ఆయన అన్నారు. ఇంత చేసినా కింది స్థాయిలో నామినేషన్లు వేయడానికి టీడీపీ కి నాయకులు దొరకలేదని ఆయన పేర్కొన్నారు. 40 ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీ ఇవాళ తమ నాయకులను ఎందుకు రహస్య క్యాంపులకు తరలించాల్సి వస్తోంది? అని చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు.