మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై ప్రతిపక్షాలు ‘కక్ష సాధింపు చర్యే’నంటూ చేస్తోన్న విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. విద్యార్థులకు సహజమైన విద్యనందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు.. రికార్డుల వేటలో అక్రమాలకు పాల్పడ్డాయని అన్నారు. అసలు పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ నారాయణ, శ్రీచైతన్య సంస్థల నుంచే వచ్చాయన్నారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ దొరికిపోయారని చెప్పిన సజ్జల.. రికార్డుల కోసం వాళ్ళు తప్పుడు విధానాలకు పాల్పడ్డారన్నారు. కాపీయింగ్‌ను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా నారాయణ చేయించారని, ఇలాంటి తప్పుడు విధానాన్ని గత ప్రభుత్వం ప్రోత్సాహించిందని ఆరోపించారు.
అయితే.. ప్రస్తుత ప్రభుత్వం గట్టిగా వ్యవహరించడం వల్లే తప్పు బయటపడిందని సజ్జల చెప్పారు. విద్యా వ్యవస్థకు కొద్దిమంది చీడలాగా తయారయ్యారని పేర్కొన్న ఆయన.. నారాయణ సంస్థ పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ జరిగిందన్నారు. ఉపాధ్యాయ లోకానికి కూడా మచ్చ తెచ్చేలా చేశారని. మాస్ కాపీయింగ్, పేపర్ల లీకేజ్‌లో వీళ్ళు స్పెషలిస్టుగా తయారయ్యారన్నారు. ఇంతకుముందెన్నడూ లేని జరగని విధంగా, చరిత్రలో తొలిసారి మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్ అయినట్టు ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై ఎగబడ్డాయని.. తామే చేసినట్టుగా ఆరోపణలు చేశాయని.. తీరా అది వికటించి వాళ్ళకే తగిలిందని అన్నారు. తీగ లాగితే డొంక కదలడమంటే ఇదేనని సెటైర్ వేశారు.
ఓ యాంత్రికమైన చదువుని సమాజానికి అంటగట్టి, ఆ ప్రాసెస్‌లో వేలకోట్లు సంపాదించిన నారాయణను చంద్రబాబు మంత్రిగా పెట్టుకున్నారని సజ్జల చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచే ఈ మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్ కల్చర్ వచ్చిందని ఆరోపించారు. ఈసారి పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా వైఎస్ జగన్ ఆదేశాలు ఇవ్వడం వల్లే.. పోలీసులు, అధికారులు రంగంలోకి దిగి, అసలు నేరస్థుల్ని పట్టుకోగలిగారన్నారు. చట్టం పరిధిలో అందరూ సమానమేనని, తప్పు చేశారని తెలియడం వల్లే వైఎస్ కొండారెడ్డిని కూడా అరెస్ట్ చేశారంటూ సజ్జల పేర్కొన్నారు. తప్పు చేసిన వారిని సీఎం జగన్ వదలొద్దని గట్టిగా సూచించారన్నారు.