వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని.. ఈ కుట్ర ఇప్పుడు పరాకాష్టకు చేరిందని సజ్జల వ్యాఖ్యానించారు.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ కుటుంబాన్ని ఇరికించేలా పూర్తిగా రాజకీయపరమైన కుట్రను ఒక ముఠా చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తమ కుటుంబంలోని ఒక నాయకుడి వ్యక్తిగత జీవితం బయటకు రాకూడదనే తాము ఇప్పటివరకు నిగ్రహం పాటించామని.. కానీ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి మాట్లాడిన తర్వాత తామూ మౌనం వీడక తప్పటం లేదన్నారు. వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి చంద్రబాబు జగన్నాటకం ఆడిస్తున్నాడని.. ఈ నాటకంలో సునీత, ఆమె భర్త పావులో, సహ పాత్రధారులో తెలియడంలేదని సజ్జల తెలిపారు. ఏమాత్రం ఆధారాలు లేకుండానే సునీత ఆరోపణలు చేస్తున్న వైనమే ఇందుకు నిదర్శనమన్నారు.