Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Story Board On India Us Trade Deal Clarity Missing Strategic Silence And The Russia Question

Story Board: అమెరికాతో డీల్ పై స్పష్టత కరువైందా..? రష్యాతో స్నేహం వదులుకోగలమా..?

Published Date :February 10, 2026 , 10:04 pm
By Sudhakar Ravula
Story Board: అమెరికాతో డీల్ పై స్పష్టత కరువైందా..? రష్యాతో స్నేహం వదులుకోగలమా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Story Board: ప్రస్తుత ప్రపంచంలో వాణిజ్య ఒప్పందాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పైగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఒడుదుడుకుల్ని ఎదుర్కుంటున్న తరుణంలో.. ట్రేడ్ డీల్స్ ప్రపంచ వృద్ధి గమనాన్ని ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. కరోనాతో యూఎస్, ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలు కుదేలైన తరుణంలో.. భారత్ ఆర్థికవ్యవస్థ ప్రపంచానికి ఆశారేఖగా నిలుస్తోంది. దీంతో కొంతకాలంగా ప్రపంచ పెట్టుబడిదారుల చూపు భారత్‌పైనే ఉంది. ఇలాంటి సమయంలో వరుస డీల్స్‌తో భారత్ దుమ్ము రేపుతోంది. న్యూజిలాండ్, ఒమన్, యూకే, ఈయూ.. ఇదే వరుసలో యూఎస్‌తోనూ డీల్ కుదిరిందనే వాదన మొదట వినిపించింది. కానీ రోజులు గడిచేకొద్దీ యూఎస్‌ డీల్‌పై కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఈ డీల్ మిగతా డీల్స్ మాదిరిగా పారదర్శకంగా కనిపించడం లేదు. కావాల్సిన క్లారిటీ రావడం లేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. ఇప్పటిదాకా జరిగిన ట్రేడ్ డీల్స్ అన్నీ.. రెండు దేశాల అధినేతల సమక్షంలో ఆయా దేశాల వాణిజ్య మంత్రులు సంతకాలు చేశారు. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన కూడా అధినేతల నోటి నుంచే వచ్చింది. దీంతో ఆ డీల్స్‌పై ఎవరికీ సందేహాలు రాలేదు. కానీ యూఎస్‌తో డీల్ మాత్రం తొలి నుంచీ సందేహాస్పదంగానే ఉంది. ఈ సందేహాలకు కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు మరింత ఆజ్యం పోశాయనటంలో సందేహం లేదు.

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంపై ట్రంప్‌ తొలుత ప్రకటన చేశారు. ఒప్పందం కుదిరిందని, సుంకాలను 18శాతానికి తగ్గిస్తున్నామని.. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని గత సోమవారం ప్రకటించారు. కానీ ట్రంప్‌ చెప్పినట్టుగా ఒప్పందం వెంటనే అమల్లోకి రాలేదు. ఒప్పందం తుది దశలో ఉందని, నాలుగైదు రోజుల్లో సంయుక్త ప్రకటన చేస్తామని.. ఆ వెంటనే అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని మంగళవారం పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఆ తర్వాత శనివారం విడుదల చేసిన అమెరికా-భారత్‌ సంయుక్త ప్రకటనలో మధ్యంతర ఒప్పందం ఫ్రేమ్‌వర్క్‌ మాత్రమే ఖరారైందని పేర్కొన్నారు. 18శాతానికి సుంకాల తగ్గింపు అమల్లోకి రాలేదు. ఇక ఆదివారం పీయూష్‌ గోయల్‌ పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంయుక్త ప్రకటనలో విడుదల చేసింది రెండు పేజీల ఫ్రేమ్‌వర్క్‌ మాత్రమేనని, చేర్చాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నారు. పలు రకాల అమెరికా ఉత్పత్తులు వచ్చిపడకుండా భారత్‌ రక్షణలు కోరినట్టుగానే.. అమెరికా కూడా పలు అంశాల్లో రక్షణలు కోరుతోందని వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతోందని, ఇంకా చాలా అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. దీనితో వాణిజ్య ఒప్పందం పరిస్థితి ఏమిటి? ఏ స్థాయిలో ఉన్నట్టు? సంయుక్త ప్రకటనలో ఇచ్చిన రక్షణలు ఉంటాయా, మారుతాయా? అమెరికా రక్షణలు కోరితే.. మన ఎగుమతుల పరిస్థితి ఏమిటి? సుంకాల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read

  • Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Story Board: ట్రంప్‌ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్‌ ఇప్పట్లో కోలుకోవా..?
Add as a preferred
source on google

భారతీయ ఉత్పత్తులపై సుంకాల భారం 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారని భారత ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా వహించిన సహనమే తుదకు జయించిందని అభివర్ణించారు. ట్రంప్ ప్రకటించినట్టు సుంకాల తగ్గింపు అమలు లోకి వస్తే అమెరికా మార్కెట్‌లో భారతీయ ఎగుమతుల పోటీతత్వం గణనీయంగా పెరగనుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, పాకిస్థాన్ దేశాలపై 19 శాతం నుంచి 20 శాతం వరకు అమెరికా సుంకాల విధింపు ఉండగా, చైనాపై 34 నుంచి 37 శాతం వరకు సుంకాల భారం ఉంటోంది. అందువల్ల ఈ దేశాలతో పోలిస్తే భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లో చవకగా లభిస్తాయి. ముఖ్యంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, వస్త్ర పరిశ్రమల ఉత్పత్తులు ఊపందుకుంటాయి. అంతవరకు బాగానే ఉంది.

కానీ కొత్త సుంకాలు తక్షణం అమలు లోకి వస్తాయన్న సూచనలు కనిపించడం లేదు. ప్రకటన తాలూకు సంప్రదాయేతర విధానం, సమగ్ర డాక్యుమెంటేషన్ లోపించడం జవాబు లేని ప్రశ్నలను మిగిల్చింది. ఒప్పందం వివరాల ప్రస్తావనకు సంబంధించి భారత్ వైపు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని, చర్చలు తుది దశలో ఉన్నాయని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెబుతున్నారు. ఈ విరుద్ధ ప్రకటన అనంగీకారాన్ని ప్రతిబింబించకపోయినా విభిన్న చర్చల తీరును సూచిస్తోంది. ఇంకా చర్చలే ఒక కొలిక్కి రానప్పుడు 18 శాతం సుంకాల తగ్గింపు ఎప్పటి నుంచి అమలు లోకి వస్తుందో నిర్వచించలేకపోతున్నారు. రెండవది అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ స్వేచ్ఛగా ద్వారాలు తెరిచిందని, ట్రంప్ నేరుగా ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. భారత వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ఈ ఒప్పందంనుంచి రక్షణ ఉంటుందని గోయల్ ప్రకటించగా, గోయల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే దీనిపై వైట్‌హౌస్ అధికార వర్గాలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు భారత్ పూర్తిగా అంగీకరించిందని కౌంటర్ ఇచ్చారు. ఈ వైరుధ్యానికి స్పష్టత రావాలంటే ఉభయ దేశాలు ఉమ్మడిగా ప్రకటించడం అవసరం. ఒప్పందంలో ఏవి అంగీకరించారో, ఏవి అమలు చేయాలనుకున్నారో స్పష్టం కావలసి ఉంది. మూడోది తక్కువ టారిఫ్‌ల పరస్పర ప్రయోజనం దృష్టా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపివేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా అమెరికా, వెనెజులా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్నారు. కానీ అదింకా నిర్ధారణ కాలేదు. భారత్ చవకగా దిగుమతి చేసుకుంటున్న చమురు దిగుమతుల్లో రష్యా వాటా గణనీయంగా ఉంటోంది. ప్రత్యామ్నాయ మార్గాలైతే వ్యయం మరింత భరించవలసి వస్తుంది. రిఫైనింగ్ సమస్యలు తప్పవు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు రష్యా విశ్వసనీయమైన వీటో దారునిగా ఉంటోంది. రష్యాతో తెగతెంపులు చేసుకుంటే దౌత్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇప్పటికీ రష్యా నుంచి భారత్‌కు రోజూ 1.1 నుంచి 1.3 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతూనే ఉంది. రష్యాలో అమెరికా ఆంక్షలు లేని సంస్థల నుంచి భారత్ చమురు దిగుమతి కొనసాగిస్తుందని పేరు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నాలుగోది అమెరికా ఉత్పత్తులపై ఏమాత్రం సుంకాలు లేకుండా చేస్తామని భారత్ అంగీకరించిందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ట్రంప్ ప్రకటించినట్టు 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి భారత్ కట్టుబడి ఉందా? అన్నది ప్రశ్నార్ధకమే. తాజా పరిణామాల ప్రకారం అమెరికా నుండి భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసే ఒప్పందం ఐదేళ్ల కాలంలో విడతల వారీగా జరగనుందని భారత్ ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే మొత్తం వస్తువుల విలువ 45 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండగా, 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువుల కొనుగోలుకు భారత్ ఎలా ఒప్పుకుందో స్పష్టం కావలసి ఉంది. మరోవైపు పీయూష్‌ గోయల్ అది భారత్‌ డిమాండ్‌కు పెద్ద సంఖ్య కాదని చెబుతున్నారు. కానీ నిజంగానే అన్ని వస్తువులు కొంటామని మాత్రం సూటిగా చెప్పడం లేదు. పైగా ఇప్పటివరకు వెల్లడైన సమాచారం చూస్తే.. భారత్‌ కంటే అమెరికాకే ఎక్కువ ప్రయోజనాలు దక్కాయనే ఆందోళన కూడా వ్యక్తమౌతోంది. సాధారణంగా ఇంత గందరగోళం ఉన్నప్పుడు.. మంత్రుల ప్రకటన తర్వాత అనుమానపు తెరలు తొలగిపోయి.. క్లారిటీ రావాలి. కానీ ఇక్కడ మంత్రుల మాటలతో మరింత అయోమయం పెరగటం.. చర్చనీయాంశంగా మారింది.

సుంకాల రాయితీలు, పెట్టుబడులు, కొనుగోళ్లు ఇవన్నీ కీలకమైన అంశాలే. లేనిపోని తొందరపాటు పడకుండా వీటన్నిటినీ సమతుల్యత చేసుకుంటేనే కానీ భారత్ చేసుకున్న ఒప్పందానికి విలువ ఉండదు. ఈ ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలు, వాదనలు, వదంతుల మధ్య ఉభయ దేశాల అధికార వర్గాలనుంచి స్పష్టమైన ప్రకటనలు రావలసి ఉంది. సుంకాలు తగ్గుతాయని భారీగా ప్రచారం చేయడంతో సరిపోదు. ఎప్పటి నుంచి అధికారికంగా కచ్చితంగా ఈ సుంకాల తగ్గుదల అమలు లోకి వస్తాయో నిర్ణయం కావాలి. ఎందుకంటే కాంట్రాక్టులు, వస్తువుల ధరల నిర్ణయం, సరఫరా వ్యవస్థ, వీటన్నిటిపై కొన్ని నెలలు ముందుగానే వాణిజ్యవర్గాల్లో చర్చలు అవసరమవుతాయి. లిఖితపూర్వకంగా ఒప్పందం ఖరారు కానంతవరకు వాణిజ్య వర్గాల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయడం, హడావిడిగా అధికార వర్గాల వివరణలు అధికారిక ఒప్పందానికి ప్రత్యామ్నాయం కాదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.

అమెరికాతో డీల్ విషయంలో భారత్‌ తొందరపడి తనకు నష్టం చేసుకుంటుందని కూడా ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అలాంటి ఆలోచనే ఉంటే.. ఐదు నెలల క్రితమే డీల్ కుదిరి ఉండేదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. భారత్‌కు అనుకూలంగా డీల్ కుదిరేదాకా చర్చించే ఓపిక తమకు ఉందని, అప్పటివరకూ తొందరేం లేదని గతంలోనే మన ప్రభుత్వం ప్రకటించింది. ఇక రైతులకు రక్షణ విషయంలోనూ .. వారి కోసం ఎంత సుంకాల భారమైనా భరిస్తామని ఇంతకుముందే మన ప్రధాని ప్రకటించారు. రష్యా చమురు అయితే అది కేవలం వాణిజ్యపరమైన అంశం కాదు. మన స్వతంత్ర విదేశాంగవిధానానికి సంబంధించిన విషయం. అసలీ విషయం గురించి అమెరికా మాట్లాడటమే మనకు ఇష్టం ఉండదనేది మన దౌత్యనీతి తెలిసిన వారు చెబుతున్న మాట. అలాంటప్పుడు డీల్ గురించి సందేహాలేమిటనే చర్చ రావచ్చు. కానీ అటు అమెరికా, ఇటు ఇండియా ఎవరికి వారు తమకు అనుకూలమైన విషయాల గురించి మాత్రమ ప్రచారం చేసుకుంటున్నాయనే అనుమానాలైతే వస్తున్నాయి. అలాగని ఈ స్థితి కూడా అలాగే కొనసాగటం లేదు. భారత్ మాత్రం ఆచితూచి మాట్లాడుతుంటే.. అమెరికా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తోంది. దీంతో అసలు ఏది నిజం..? అనే ప్రశ్న అలాగే ఉంటోంది. అక్కడ కేవలం ట్రంప్ మాత్రమే కాదు వ్యవసాయ మంత్రి, వాణిజ్య సలహాదారులు కూడా భారత్‌ తమ షరతులకు అంగీకరించిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కేవలం పీయూష్ గోయల్ మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలతో మాట్లాడారే కానీ.. పార్లమెంట్‌లోనో, ప్రెస్‌మీట్‌లోనో డీల్ గురించి కీలక ప్రకటన ఏమీ చేయలేదు.

ఇక్కడ డీల్ విషయంలో కేవలం సామాన్యులకే కాదు ఎంపీలకూ చాలా సందేహాలున్నాయి. తమ ప్రశ్నలకు బదులివ్వాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా కొందరు మంత్రులు సమాధానాలిస్తున్నారు. కానీ అవేవీ ఎంపీలను పూర్తిస్థాయిలో సమాధానపరచలేకపోతున్నాయనే మాట వాస్తవం. ఈ సందిగ్ధతకు ఎప్పుడు తెరపడుతుందోనని వాణిజ్య వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీల్ ఉందా.. లేదా అనే విషయం కంటే.. ఈ సందిగ్ధ స్థితిని ఫేస్ చేయడం మరింత కష్టంగా ఉందని వ్యాపారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తుంది. అయితే, తెర వెనుక రాజకీయ లెక్కలు, వ్యూహాత్మక ఎత్తుగడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో, 2018లో అమెరికా విధించిన సుంకాలు, 2025 నాటి తీవ్ర వాణిజ్య సంక్షోభం వంటివి ఇరు దేశాల సంబంధాలలో ఘర్షణకు దారితీశాయి. ఈ ఒప్పందం ఆ విభేదాలను తగ్గించి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి ఉద్దేశించినా, ఇది కేవలం ఒక లావాదేవీ వంటిదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ 500 బిలియన్ డాలర్ల అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందనే హామీపై చాలా ప్రశ్నలున్నాయి. దీనిపై చూచాయగా పీయూష్ గోయల్ వెలుబుచ్చిన అభిప్రాయాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత్‌కు సున్నితమైన అంశాలు. ఆరోగ్య, పర్యావరణ కారణాలు, లక్షలాది మంది రైతుల జీవనోపాధి దృష్ట్యా భారత్ వీటిని ఎప్పటినుంచో పరిరక్షిస్తోంది. ఈ రాయితీలు బ్రిక్స్ దేశాలతో భారత్ సంబంధాలను దెబ్బతీస్తాయా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ఈయూ ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వంటి దశాబ్దాల చర్చలతో పోలిస్తే, యూఎస్‌ ఒప్పందం సంక్లిష్టంగా కనిపిస్తోందనటంలో సందేహం లేదు. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లను భారత్ 0 శాతానికి తగ్గిస్తోంది. ఇది అమెరికా రైతులకు గొప్ప విజయం అని యూఎస్ వాణిజ్య ప్రతినిధి గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ , వైన్, స్పిరిట్స్, పండ్లు, కూరగాయలపై పన్నులు సున్నాకు చేరుతాయని అంటున్నారు. అయితే, మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాత్రం దీనిపై కాస్త భిన్నంగా స్పందించారు. 140 కోట్ల భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం చేసుకున్నామని, ముఖ్యంగా దేశీయ వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించామని తేల్చిచెప్పారు. కానీ, అమెరికా పేర్కొన్న 0% టారిఫ్ అంశంపై ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. రష్యాకు బదులుగా వెనెజువెలా నుంచి చమురును కొనుగోలు చేయడమంటే ఇంధన భద్రతకు సంబంధించిన సార్వభౌమాధికారం అగ్రరాజ్యానికి తాకట్టు పెట్టినట్టే అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌లోని అంతర్గత నిర్ణయాల మీద అమెరికా పర్యవేక్షణ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రష్యా మనకు దశాబ్దాల మిత్ర దేశం. చవగ్గానే అక్కడి నుంచి మనకు చమురు దిగుమతి అవుతుంది. ఇప్పుడు, డీల్‌ పేరుతో రష్యాతో సంబంధాలు తెంచుకొంటే.. అది భారత్‌కు ఆర్థికంగానే కాదు దౌత్యపరంగానూ ఎంతమాత్రం మంచిది కాదనే సంగతి అందరికీ తెలిసిందే.

ఐదు దశాబ్దాలుగా భారత్‌కు రష్యా అత్యంత స్థిరమైన రక్షణ భాగస్వామిగా ఉంది. అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్‌ నిలిపివేస్తే.. అది మాస్కో ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపడమే కాక, ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, దీర్ఘకాలిక సహకారం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్పును అమెరికా ఒత్తిడికి భారత్‌ లొంగిపోయిందని రష్యా భావిస్తే రక్షణ సామగ్రి, ఆధునిక సాంకేతికత, ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తికి భారత్‌ ప్రాధాన్యతను ఆ దేశం తగ్గించవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగంలోని జలాంతర్గాములు, ఎస్‌-400 వ్యవస్థలు, ఇతర సైనిక వ్యవస్థల వంటి వ్యూహాత్మక కీలకమైన ఆయుధాల సరఫరాలో దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు. ఇంధన భద్రతలో దుర్భలత్వం, విదేశాంగ విధాన స్వయం ప్రతిపత్తిపై ఒత్తిళ్లు, రష్యాతో సంభావ్య ఘర్షణ వంటి దీర్ఘ కాలిక నష్టాలూ ఉన్నాయి. ఇక రష్యాకు బదులుగా వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకొంటే భారత్‌కు రవాణా ఖర్చు తడిసిమోపెడవుతుంది. వెనెజువెలా భారత్‌ సగటు దూరం 13,000-15,000 కి.మీ. ప్రయాణ కాలం 40-45 రోజులు. అంటే రెట్టింపు దూరం, రెట్టింపు సమయం పడుతుంది. దీంతో రవాణా ఖర్చు కూడా 30-50 శాతం ఎక్కువ అవుతుంది. దీనికి తోడు ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా ఎక్కువే. అలాగే రష్యా చమురు లైట్‌ క్రూడ్‌ కావడంతో దీనిని తక్కువ ఖర్చుతో సులువుగా ప్రాసెస్‌ చేయవచ్చు. ఇక వెనెజువెలా చమురు హెవీ క్రూడ్‌ కావడంతో ఇది శుద్ధి చేయడం కష్టం. పైగా ఖర్చు కూడా పెరుగుతుంది. అలాగే రష్యా చమురుపై లభించే డిస్కౌంట్‌ వెనెజువెలా చమురుపై లభించదు. మొత్తం మీద భారత్‌కు దిగుమతి బిల్లు పెరుగుతుంది. తద్వారా ద్రవ్యోల్బణం మీద కూడా ప్రభావం చూపుతుంది.

నిజానికి యూఎస్‌తో డీల్ విషయంలో మొదట్నుంచీ రష్యా చమురు, మన వ్యవసాయ, డెయిరీ రంగాలకు రక్షణలే ప్రధాన ప్రతిబంధకంగా ఉన్నాయి. ఆ రెండు షరతులు లేకపోతే మిగతా దేశాలన్నింటి కంటే ముందే యూఎస్‌ మనతో ట్రేడ్ డీల్ ఖరారు చేసేది. ఈ విషయం గతంలో ట్రంపే స్వయంగా చెప్పారు. కానీ ఇప్పుడు డీల్ తుది దశకు చేరుతున్న సమయంలోనూ ఆ అంశాలపైనే సందేహాలు అలాగే ఉండటమే పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు విషయాలపై క్లారిటీ రాకుండా డీలేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కీలక అంశాలపై వ్యూహాత్మక మౌనం, దాటవేసే సమాధానాల వెనుక భారత్‌ లోతైన వ్యూహం అమలుచేస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. ముందుగా రష్యా చమురు విషయానికొస్తే.. త్వరలో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని, అప్పుడు రష్యాపై ఆంక్షలు ఉండవని.. ఆ పరిస్థితిలో రష్యా చమురు కొనుగోలు విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఉండబోదని చెబుతున్నారు. మరోవైపు రష్యాతో చమురు కాంట్రాక్టు కూడా ఈ ఏడాది నవంబర్ దాకా ఉందని, ఆ తర్వాత కాంట్రాక్ట్ పునరుద్ధరణ ఉండదనే హామీ ఇస్తే నష్టం లేదని,ఆ తర్వాత కూడా కనీస స్థాయిలో చమురు కొనుగోలుకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక వ్యవసాయ ఉత్పత్తుల విషయానికొస్తే.. పైకి అమెరికాకి కాస్త మొగ్గు కనిపిస్తున్నా.. కొన్ని ఉత్పత్తులు.. మన ఉత్పత్తుల పోటీతత్వం పెంచుతాయని, దీర్ఘకాలంలో మనకే ఎక్కువ ప్రయోజనం దక్కుతుందని కొన్ని లెక్కలు చెబుతున్నారు. అయితే ఇవేవీ అంత త్వరగా అర్థమయ్యేలా లేవు. దీంతో గందరగోళం యథాతథంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వ్యూహాలు అనుకున్నట్టుగా అమలౌతాయనే గ్యారెంటీ ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ వ్యూహాలపై అంత నమ్మకం ఉంటే అదే సంగతి అధికారికంగా ఎందుకు చెప్పరని నిలదీస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనమే.. భవిష్యత్తులో అవకాశాలు సృష్టిస్తుందని వినిపిస్తున్న వాదనను వంద శాతం నమ్మలేం అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

మొత్తం మీద యూఎస్‌తో డీల్ విషయంలో తెర ముందు, తెర వెనుక పరస్పర విరుద్ధమైన వ్యవహారాలున్నాయా అనేది కూడా పూర్తిగా తేలటం లేదు. ఇంకా చెప్పాలంటే ఎక్కడైనా డీల్ అంటే అందరికీ ఒకేరకంగా అర్థం కావాలి. కానీ యూఎస్‌ డీల్ మాత్రం అమెరికాకు ఒకలా, ఇండియాకు మరోలా అర్థమవుతోంది. అది కూడా పోనీలే అని సరిపెట్టుకుందామనుకున్నా అలా కూడా కుదరటం లేదు. ఎందుకంటే భారత్‌లోనూ అన్ని వర్గాలకూ డీల్ ఒకేలా అర్థం కావడం లేదు. డీల్‌ను రాజకీయ వర్గాలు ఒకలా, వ్యాపార వర్గాలు మరోలా, మార్కెట్లు ఇంకోలా అర్థం చేసుకుంటున్నాయి. ఎవరికి వారు డీల్‌లో ఎక్కడోచోట ఉన్న తమ ప్రయోజనాల్ని హైలైట్ చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారా అనే సందేహాలు సామాన్యుల మెదళ్లను తొలిచేస్తున్నాయి.

డీల్ అంటే డీల్. కానీ అమెరికాతో డీల్ మాత్రం కొత్త కొత్త పదాలను దేశ ప్రజలకు పరిచయం చేసింది. మధ్యంతర డీల్, దానికీ ఓ ఫ్రేమ్ వర్క్.. ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ కారణంగానే డీల్ గురించిన రకరకాల ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఉదాహరణకు ఇటీవలే జరిగిన ఈయూ డీల్‌లో అన్ని విషయాలపైనా పూర్తి క్లారిటీ ఉంది. పైగా అటు ఈయూ, ఇటు భారత్ ప్రతినిధులు ఒకే మాట చెప్పారు. ఓ పక్షం వాదనను మరో పక్షం సమర్థించింది. ఎవరికి వారుగా కాకుండా కలిసికట్టుగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మరి అమెరికా డీల్ విషయంలో అలా ఎందుకు జరగలేదు అనేది ప్రాథమిక సందేహం. అప్పుడే చావుకబురు చల్లగా చెప్పినట్టుగా.. డీల్ కుదరలేదు. తుది దశలో ఉంది అని చెప్పారు. అలాంటప్పుడు ట్రంప్, మోడీ సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు చేస్తున్నారనే ప్రశ్నలు వచ్చాయి. దీంతో ఓ గొప్ప ఒప్పందం కుదరదనుందన్న ఉత్సాహంలో అధినేతలు స్పందించారనే అభిప్రాయం వెల్లడైంది. ఆ స్పందనల్లో ఏకాభిప్రాయం లేదనే కోణం వెంటనే వెలుగుచూసింది. ఎప్పటిలాగే ట్రంప్ డీల్ తమకు అనుకూలమని చెప్పుకునే ప్రయత్నం గట్టిగా చేశారు. కానీ ట్రంప్ వైఖరి అర్థం చేసుకున్న మన ప్రజలు.. ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తుందని ఎదురుచూశారు. అలాగే సర్కారు నుంచి ప్రకటన వచ్చింది. మంత్రులు చాలా వివరంగా మాట్లాడారు. కానీ విచిత్రంగా ఇంకా సమాధానాలు రాని ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. పైగా రోజురోజుకూ సందేహాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదు. దీంతో అసలేం జరుగుతుందోననే అయోయమం విజయవంతంగా కొనసాగుతోంది.

అమెరికాతో డీల్ విషయంలో మన ప్రభుత్వం కొత్త వ్యూహాలతో పనిచేస్తోందని, అందుకే సందిగ్ధ పరిస్థితి తలెత్తిందనే సమర్థనలు వినటానికి బాగానే ఉన్నాయి. కానీ వీలైనంత త్వరగా సందేహాలు తొలగించాల్సిన బాధ్యత సంగతేంటనే ప్రశ్నలు మాత్రం ఆగటం లేదు. ఎవరేమనుకున్నా కొంతకాలం ఈ అయోమయం తప్పదని కొందరు నిపుణులు తేల్చేస్తున్నారు. బహుశా మార్చిలో మధ్యంతర ఒప్పందంపై సంతకాలు చేసే సమయంలో క్లారిటీ రావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే సందట్లో సడేమియాలాగా అసలు మార్చిలో సంతకాలు గ్యారంటీయేనా అని మరికొందరు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నారు. అందుకే ఈ అయోమయానికి త్వరగా తెరదించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక్కడ ఇండియా అమెరికా డీల్ కేవలం ఈ రెండు దేశాల మీదే కాకుండా ప్రపంచ వాణిజ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతుందనే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. అలాంటప్పుడు డీల్ విషయంలో మరింత స్పష్టత అవసరమౌతుంది. కానీ లేనిపోని సందేహాలు రేకెత్తుతున్నా.. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేయకపోవటం, క్లారిఫికేషన్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారనే వాదనలకు తావిస్తోంది. ఏ విషయం మీదైనా స్పష్టత ఉన్నప్పుడే అనవసర అనుమానాలకు తెర పడుతుంది. కానీ ఏ విషయంపై అయినా అనుమానపు మేఘాలు ముసురుకుంటే.. అది మరింత సంక్లిష్టం అవుతుందనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అన్నీ తెలిసీ ఎందుకు డీల్‌పై స్పష్టత ఇవ్వలేకపోతున్నారనే కొత్త ప్రశ్నలు తాజాగా దూసుకొస్తున్నాయి. ఇంతవరకూ ప్రాథమిక ప్రశ్నలకే సమాధానాలు రాని స్థితిలో.. కొనసాగింపు ప్రశ్నలు, ఉప ప్రశ్నలు, తాజా ప్రశ్నలకు ఆన్సర్ సంగతేంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Global trade agreements India
  • India foreign policy strategy
  • India trade uncertainty
  • India US economic relations
  • India US tariff reduction

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions