ఏపీలో పీఆర్సీపై జారీ చేసిన కొత్త జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలకు చెందిన స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారని ఆయన తెలిపారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చలు ప్రారంభమయ్యాయని, ఇది సానుకూల పరిణామం అన్నారు. పీఆర్సీ అమలు విషయంలో చర్చల పరంగా మరింత ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు గతంలో ఇచ్చిన డిమాండ్లలో ఒకటి ఇక వర్తించదని… ఎందుకంటే ఇప్పటికే కొత్త జీవోల ప్రకారం వేతనాలు వారి ఖాతాలలో పడిపోయాయని సజ్జల చెప్పారు.
Read Also: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే?
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల విషయంలో ప్రభుత్వం ఓపెన్ మైండ్‌తో ఉందని సజ్జల తెలిపారు. ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. రికవరీలు లేవు కనుక కోర్టు పేర్కొన్న విషయం వర్తించదని ఆయన స్పష్టం చేశారు. రికవరీ వేరు.. ఐఆర్ వేరు అని సజ్జల క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగులు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక అడిగారని వెల్లడించారు. జీవోలు రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని, ఉద్యమ కార్యాచరణను నిలిపివేయాలని తాము నచ్చచెప్పే ప్రయత్నం చేశామని సజ్జల పేర్కొన్నారు.