ఏపీలో జంగారెడ్డి గూడెం ఘటన అటు విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై మానవహక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశామన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలజనాథ్. 30 మంది మృతికి గల కారణాలు బయటకురావాలన్నారు. ఇప్పటి వరకు ఎక్సైజ్ మంత్రి జంగారెడ్డి గూడెం ఎందుకు సందర్శించలేదని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనపై హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేస్తాం అన్నారు. సీఎం జగన్ ప్యాలెస్సులో కూర్చుంటే పాలన సాగదు. నాటుసారా తాగి అనేకమంది చనిపోతున్నారు. అధికార యంత్రాంగం వత్తిళ్లకు భయపడి సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారు. జ్యూడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు శైలజానాథ్. వైసీపీ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం చెందింది. ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
జంగారెడ్డి గూడెంలో ఒకరి తరువాత ఒకరిగా రోజుల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది. మరణించినవారి సంఖ్య 19కి చేరింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తి బుధవారం తుదిశ్వాస విడిచారు. దాదాపుగా వారం రోజుల్లోనే ఇంత మంది చనిపోవడంతో సహజంగానే వీటిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. సారా తాగడం వల్లే ఈ మరణాలు చోటుచేసుకున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారపార్టీలో మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు ఇవి సహజ మరణాలే అని బల్లగుద్దుతుండడం విమర్శలకు గురవుతోంది. ప్రతిపక్షాలు శవరాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి అలా ఉంచితే, దీనిపై స్పందించి, వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.
గడిచిన నాలుగైదు రోజుల్లో జంగారెడ్డిగూడెంలో 243 లీటర్ల సారా, 18,300 లీటర్ల బెల్లం ఊట, 63,048 కిలోల నల్లబెల్లంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లెక్కల్ని బట్టి చూస్తే జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో సారా కాయడమన్నది చిన్నసైజు పరిశ్రమగా సాగుతోందంటున్నారు. ఇప్పటికైనా జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకుంటున్న వరుస మరణాలపై ప్రతిపక్షాలు కోరుతున్న విధంగా తక్షణం న్యాయ విచారణ జరిపించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. నష్టపరిహారం చెల్లించాలి. మద్యంలో సారాను కల్తీ చేసి అమ్ముతున్నట్లు వస్తున్న వార్తలపై తక్షణం దృష్టి సారించాలి.