ఏపీలో జిల్లాల విభజన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాల విభజనపై వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల విభజన పక్రియపై ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ స్పందించారు. విశాఖలో నాలుగు జిల్లాలకు సంబంధించిన అభ్యంతరాలు పరిశీలించామని.. వాటిలో ఏవి సహేతుకంగా ఉన్నాయో.. ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో అన్న విషయాన్ని పరిశీలించామని ఆయన తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 12 జిల్లాల అభ్యంతరాలపై సమీక్ష జరిపామని.. ఇంకా నెల్లూరు జిల్లా పూర్తి కాలేదని ప్రణాళిక శాఖ సెక్రటరీ విజయ్ కుమార్ తెలిపారు. అది కూడా పూర్తి చేసి తుది నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఏప్రిల్ 2న జిల్లాల విభజనపై ప్రకటన వస్తుందని.. అదే రోజు నుంచి కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రతి జిల్లాలో మండల నియోజకవర్గాలకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయన్నారు.
విశాఖ నుంచి 250, ఈస్ట్ గోదావరి నుంచి 300, విజయనగరం నుంచి 4వేలు, శ్రీకాకుళం నుంచి 40 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. శాస్త్రీయ పద్దతిలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేశామన్నారు. 2020-2021 జనాభా లెక్కల జరగాలి కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడిందన్నారు. జిల్లా బౌండరీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 30 లోపు పూర్తి చేయాలని చెప్పింది కానీ ఏప్రిల్‌లోనే తాము పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిపాలన కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భవనాలు భూములు వినియోగిస్తామని, అనివార్యం అయితే ప్రైవేటు భవనాలు ఉపయోగిస్తామని విజయ్‌కుమార్ వెల్లడించారు.