తెలుగు పత్రికా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు తన బొమ్మలతో ఊపేసిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1942 సెప్టెంబర్ 29న అనకాపల్లిలో అన్నపూర్ణ, లక్ష్మణరావు దంపతులకు జన్మించిన బాలి విద్యాబ్యాసం అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో చేరారు. కానీ చిత్రలేఖనం పట్ల ఉన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1974లో ఈనాడు దిన పత్రిక విశాఖపట్నం ఎడిషన్ లో పొలిటికల్ కార్టూనిస్టుగా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో సాఫ్ట్ కార్టూనిస్టుగా చేరినప్పటి నుండి బాలి చిత్రలేఖన విశ్వరూపం మొదలైంది. ఆ పత్రిక సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ… మేడిశెట్టి శంకరరావు పేరును ‘బాలి’గా మార్చారు. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలోనే వేలాది కథలకు బొమ్మలు గీశారు. నవలలకు ముఖచిత్రాలను వేశారు. బాపు బాటలో సాగుతూ, వందల గ్రీటింగ్ కార్టూన్స్ ను రూపొందించారు. బాపు తర్వాత ఆ స్థాయిలో విరివిగా తెలుగు పత్రికలకు దశాబ్దాల పాటు బొమ్మలు గీసింది బాలి నే! 1984లో ఆంధ్ర జ్యోతి సంస్థ నుండి బయటకు వచ్చిన బాలి… ఫ్రీలాన్సర్ గా కెరీర్ కొనసాగించారు. కొంతకాలం హైదరాబాద్ లోని కలర్ చిప్స్ లో యానిమేటర్ గా సేవలు అందించారు.
చిత్రలేఖనంతో పాటు బాలి కార్టూనిస్టుగానూ విశేష పేరు ప్రఖ్యాతులను ఆర్జించారు. ఆయన తొలి కార్టూన్ ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. ఆయన బొమ్మలు, కార్టూన్లు ప్రచురితం కాని పత్రిక లేదంటే అతిశయోక్తి కాదు. వివిధ వార, పక్ష, మాస పత్రికల్లో బాలి కార్టూన్ శీర్షికలూ నిర్వహించారు. అంతర్జాతీయ కార్టూన్ పోటీలలోనూ బాలి కార్టూన్లు బహుమతులు పొందాయి. ఆయన వేసిన కార్టూన్లు ఆరేడు పుస్తకాలుగా వచ్చాయి. బాలి కుమారుడు ఇటీవలే అమెరికాలో ప్రమాదంలో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బాలిని చూసుకోవడానికి ఆయన కుమార్తె అమెరికాను నుండి విశాఖ పట్నం వచ్చారు. ఐదారు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న బాలి సోమవారం అర్థరాత్రి కన్నుమూశారని, మంగళవారం విశాఖలో అంత్యక్రియలు జరుపుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలి మృతిపట్ల పలువురు కార్టూనిస్టులు సంతాపం తెలిపారు.