Recording Dances: ఏపీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. అయితే అధికార పార్టీ నేతల అండతోనే ఇవి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో బ్రహ్మంగారిమఠం మండలంలో జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి. చెంచయ్యగారిపల్లెలో డీజే మాటున మహిళలతో అశ్లీల నృత్యాలను నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల మద్దతుతో గతరాత్రి బహిరంగంగా రికార్డిండ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also: Rishab Pant: కోలుకున్న రిషబ్ పంత్.. రోడ్డుప్రమాదం తర్వాత తొలిసారి ట్వీట్
కాగా జగన్ ప్రభుత్వం ప్రజల ఆనందం కోసం నిర్వహించే ఏ కార్యక్రమాన్నీ అడ్డుకోదని ఇటీవల వైసీపీ నేత తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. పండగ మూడు రోజులూ గ్రామీణ క్రీడలను పోలీసుల ఆంక్షలతో ప్రమేయం లేకుండా ప్రజలంతా యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆయన ప్రకటించారు. స్వయంగా ఎమ్మెల్యేల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో పలు చోట్ల అధికారికంగానే రికార్డింగ్ డ్యాన్సులు, గుండాటలు, కోడిపందాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారిమఠంలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.