ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేతలు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు… బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మధ్య రాజీ కుదిరింది.. 2010లో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం వీరిద్దరూ ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు.. మొత్తంగా పుష్కరకాలంగా నానుతూ వచ్చిన వివాదానికి ఇవాళ ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది… కాగా, 2010లో రాయపాటిపై కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా వేశారు.. ఆ సమయంలో ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం గమనార్హం. అప్పట్లో రాయపాటి గుంటూరు లోక్‌సభ ఎంపీగా ఉండగా.. కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నారు.. అయితే, స్థానిక రాజకీయాల నేపథ్యంలోనే రాయపాటిపై పరువు నష్టం దావా వేశారు కన్నా.. అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తూనే ఉంది.. ఇవాళ కోర్టుకు హాజరయ్యారు రాయపాటి, కన్నా… కేసులో విచారణ పూర్తి కావడంతో.. ఇద్దరిని కోర్టుకు రమ్మని న్యాయమూర్తి ఆదేశించడంతో.. కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇద్దర నేతలు హాజరయ్యారు.
2010లో కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు రాయపాటి సాంబశివరావు.. ఇక, తాను వేసిన పరువు నష్టం దావాను కూడా ఉపసంహరించుకుంటున్నానని కోర్టుకు తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ… అలా న్యాయమూర్తి సమక్షంలో ఇద్దరు నేతల మధ్య రాజీ కుదురింది.. సీనియర్ నేతలు రాజకీయాల్లో ఉన్నవారు భావితరాలకు ఆదర్శంగా ఉండాలని.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తగదు అని ఈ సందర్భంగా కోర్టు సూచించింది.. కోర్టు సూచనతో తాము చేసిన ఆరోపణలను ఉపసంహరించుకున్నారు ఇరువురు నేతలు… రాజీ కోసం సంతకాలు కూడా చేశారు రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ. దీంతో రాయపాటి సాంబశివరావుపై కన్నా లక్ష్మీనారాయణ వేసిన పరువు నష్టం దావా కేసును కొట్టివేసింది కోర్టు.