వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోపక్క చెరువులకు గండ్లు పడుతున్నాయి. నిన్నటివరకు ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలు చిత్తూరులో కొంచెం ఆగిపోయాయి. అయితే తాజాగా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మళ్లీ ఎడతెరపి లేకుండా చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా బయటకు ఎవరూ రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు. అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతిలో మునుపెన్నడూ లేని విధంగా వరద రావడంతో ఏడుకొండలు సెలయేళ్లను తలపిస్తున్నాయి.