ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ… ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుండగా.. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు.. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉంది… అంతే కాదు రాష్ట్రంలోని అన్ని పార్టీల రిమోట్ కంట్రోల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉందని ఆరోపించారు.. ఇక, అన్నదమ్ముల్లా కలసి ఉన్న దేశాన్ని బీజేపీ విభజిస్తోందని విమర్శించిన ఆయన.. కుల, మతాల పేరుమీద విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రధాని నరేంద్ర మోడీ రిమోట్‌తో ఆంధ్రప్రదేశ్‌ని శాసిస్తున్నారు.. అందుకు కారణం ఏమిటో అందరికీ తెలుసు అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Pothula Sunitha: బాబు, పవన్ కలసి పోటీచేసినా డిపాజిట్లు కూడా రావు..!
మరోవైపు బీజేపీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కమిట్‌మెంట్స్ ఉన్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ.. కానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆంధ్రప్రదేశ్‌తో చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయని తెలిపారు.. మేం పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ , రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. ఈ అంశాలను లెవనెత్తడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డ ఆయన.. బీజేపీ కంట్రోల్ లో ఉన్నందుకు ఈ అంశాలు లెవనెత్తడం లేదని ఆరోపించారు.. రాయలసీమకు న్యాయం చేయడం, స్పెషల్ స్టేటస్ కు యూపీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.. కాగా, రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని.. ఆ విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉందన్నారు. విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలన్నారు. మూడు రాజధానుల ఆలోచన సరికాదని హితవుపలికిన ఆయన.. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. పోలవరం పూర్తి చేస్తామని ఉదయం రాహుల్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.