Rahul Gandhi: ఏపీలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆదోనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీకి ఒక్కటే రాజధాని ఉండాలని.. అది అమరావతి మాత్రమే ఉండాలని తన అభిప్రాయంగా రాహుల్ గాంధీ తెలియజేశారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామని, వాటిని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని రాహుల్ గాంధీ అన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా కూడా విభజన హామీలలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గతంలో జరిగిన రాష్ట్ర విభజనపై కాకుండా పాలకులు భవిష్యత్‌పై దృష్టి సారించాలని రాహుల్ గాంధీ సూచించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Also: CPI Ramakrishna: వైసీపీని కాపాడుతోంది బీజేపీ అధినాయకత్వమే.. పవన్ ఇప్పుడే మేల్కొంటున్నారు
ఏపీలో పార్టీలు రాజకీయాలను బిజినెస్‌లా చూస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఏపీలో రైతులు, కార్మికుల హక్కులు కాపాడాలన్నారు. ఏపీలో జర్నలిస్టులపై దాడులు దారుణమని.. జర్నలిస్టులకు స్వేచ్ఛ ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. పోలవరం వల్ల వచ్చే ప్రయోజనాలను రైతులకు అందేలా చూస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న శశిథరూర్ వ్యాఖ్యలు సరికాదని, ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తప్ప ఏ పార్టీలోనూ నేతలు బహిరంగంగా తమ అసంతృప్తిని తెలియజేయరని రాహుల్ తెలిపారు. రేపు కేంద్రంలో వైసీపీ మద్దతు తీసుకునే విషయంలో తాను నిర్ణయం తీసుకోలేను అని అన్నారు. ఎవరితో పొత్తులు ఉండాలన్న విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడిదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు.
భారత ఆర్ధిక వ్యవస్థ క్రాష్ కావడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కారణమని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర దేశ సమగ్రతకు సంబంధించిందన్నారు. తమ పార్టీ అందరిదీ అని.. తాము దేశాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడదీయాలని చూడటం లేదన్నారు. ఏపీలో తన పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో వన్ జీఎస్టీ-వన్ ట్యాక్స్ రావాలన్నారు. దేశంలో కుల రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.