CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసే ముందు బీజేపీ విషయంలో క్లారిటీ కావాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ విషయంలో క్లారిటీ ఇస్తే.. పవన్, చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. వైసీపీతో బీజేపీ అంటకాగుతోందని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. ఏ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌కు లేనన్ని శాఖలను విజయసాయిరెడ్డికి అప్పజెప్పారని.. వైసీపీని మోదీ- అమిత్ షా కౌగిలించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏం చేయలేని సోము వీర్రాజు పోరాడితే ఎంత.. పోరాడకుంటే ఎంత అని అభిప్రాయపడ్డారు.
Read Also: ISRO: రికార్డు సృష్టించనున్న ఇస్రో.. ఒకేసారి 36 ఉపగ్రహాలు ప్రయోగం
జగన్‌పై కేసులు మొదలుకుని వైఎస్ వివేకా హత్య కేసు వరకు వైసీపీని కాపాడుతోంది బీజేపీ అధినాయకత్వమేనని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు చేశారు. బీజేపీ విషయంలో పవన్ ఇప్పుడే మేల్కొంటున్నారని.. ఆయనకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. వైసీపీ విషయంలో బీజేపీపై క్లారిటీ వచ్చాకే.. రోడ్ మ్యాప్ ఇవ్వాలని పవన్ పదే పదే అడుగుతున్నారని రామకృష్ణ తెలిపారు. ప్రజాస్వామ్యం కోసం అన్ని పక్షాలు కలవాలని ఆశించడంలో అభ్యంతరం ఏమీ లేదని.. ఎందుకంటే ప్రజాస్వామ్యం అందరికీ అవసరమన్నారు.