అసలే గర్భిణి. నిత్యం మద్యం సేవించి వేధించే భర్త..బిడ్డ కోసం అన్నీ భరించాలనుకున్నా వీలు కాలేదు. అమ్మగారి ఇంటికి వెళ్లాలని నడక మొదలుపెట్టిందా యువతి.తిరుపతి నుంచి రెండు రోజుల పాటు నడిచి 65 కిలోమీటర్ల దూరంలోని నాయుడు పేటకు చేరుకుంది. స్థానికుల సహకారంతో బిడ్డకు జన్మనిచ్చింది. రాజమహేంద్రవరంలోని వై.ఎస్.ఆర్.నగర్ కు చెందిన వర్షిణి దంపతులు పొట్టకూటి కోసం తిరుపతికి వెళ్లారు. నిత్యం భర్త మద్యం సేవించి వేధిస్తుండటంతో వర్షిణి తట్టుకోలేక పోయింది. నిండు చూలాలు కావడంతో తనను వేధించవద్దని వేడుకున్నా ఆ భర్తలో మార్పు రాలేదు. వర్షిణికి మతిస్థిమితం కూడా లేకపోవడంతో అమ్మగారి ఊరైన తునికి వెళ్లేందుకు కాలి నడకన బయలు దేరింది.
రెండు రోజుల పాటు తిరుపతి నుంచి నడిచి నాయుడు పేటకు చేరుకుంది బస్టాండ్ వద్ద కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు స్పందించి 108 కు ఫోన్ చేశారు. దీంతో సిబ్బంది ఆమెను వాహనంలోకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించి సురక్షితంగా డెలివరీ చేశారు. 9 నెలలు నిండక పోవడంతో బిడ్డ పరిస్థితి బాగాలేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సఖి కేంద్రం సిబ్బంది సహకరించి ఆసుపత్రిలో చేర్చారు. తన భర్త వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని వర్షిణి తెలిపారు. తల్లి బిడ్డ పరిస్థితి బాగుందని వైద్యులు చెప్పారు.
Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్‌కు దూరం